Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పింఛన్‌ సంస్కరణలపై
ఫ్రాన్స్‌ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాలు

. తృటిలో తప్పించుకొన్న ప్రభుత్వం
. నేటి మాక్రాన్‌ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

పారిస్‌: వివాదాస్పద పింఛన్‌ సంస్కరణలపై ప్రాన్స్‌ అట్టుడికిపోతోంది.అటు పార్లమెంటులోనూ ఈ అంశం ప్రకంపనలు సృష్టించింది. రెండు అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టగా స్వల్ప మెజారిటీతో తమ అధికారాన్ని మాక్రాన్‌ ప్రభుత్వం కాపాడుకోగలిగింది.దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇదే క్రమంలో అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌ బుధవారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. పింఛన్‌ సంస్కరణలపై ఆయన ఏం మాట్లాడతారన్నది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాల నుంచి తృటిలో తప్పించుకొని ప్రభుత్వం నిలద్రొక్కుకోగలిగిన క్రమంలో అధ్యక్షుడి ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడిరది. సోమవారం సాయంత్రం పింఛన్‌ సంస్కరణలపై జరిగిన ఆందోళనలలో 200 మందికిపైగా అరెస్టు అయినట్లు పోలీసులు తెలిపారు. పార్లమెంటులో మాక్రాన్‌ ప్రభుత్వం నెగ్గిన గంటల వ్యవధిలో ఆకస్మిక ఆందోళనలు పెద్దఎత్తున జరిగాయి. ఓ దశలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య పారిస్‌లో ఘర్షణ జరిగింది. మాక్రాన్‌ ప్రభుత్వం విశ్వాస ఓటు ఓడిపోయివుంటే పదవీ విరమణ వయస్సును 62 నుంచి 64కు పెంచుతూ తెచ్చిన శాసనం కూడా రద్దు అయ్యేది.పింఛన్‌ సంస్కరణలకు విరుద్ధంగా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికి కేవలం తొమ్మిది ఓట్లు తగ్గాయి. 287 ఓట్లు వచ్చాయి. దీంతో మాక్రాన్‌ ప్రభుత్వం తుటిలో అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. నేషనల్‌ అసెంబ్లీ (పార్లమెంటు దిగువ సభ)లో పింఛన్‌ సంస్కరణలకు ఆమోదం లభించింది. పింఛన్‌ సంస్కరణలపై రెండు అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. అటు పెట్రో డిపోల వద్ద సమ్మెల కారణంగా చమురు కొరత నెలకొంది. ఫలితంగా సముచిత నిల్వలు ఉండేలా చూడాలని మంగళవారం ప్రభుత్వం ఆదేశాలను జారీచేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img