Friday, April 19, 2024
Friday, April 19, 2024

పుతిన్‌ను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు!

ఉక్రెయిన్‌ వ్యాఖ్యలకు రష్యా ప్రతిస్పందన
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. తమ హత్యల జాబితాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మొదటి స్థానంలో ఉన్నారని ఉక్రెయిన్‌ నిఘా అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి రష్యా ఘాటుగా ప్రతిస్పందించింది. పుతిన్‌ భద్రత విషయంలో ఏం చేయాలో తమ సిబ్బందికి తెలుసని బదులిచ్చారు. ‘కీవ్‌ పుతిన్‌ను హత్య చేయాలని అనుకుంటోంది. ఎందుకంటే యుద్ధంలో ఏం జరగాలనేది ఆయనే నిర్ణయిస్తున్నారు. మా కిల్‌ లిస్ట్‌లో తొలివరుసలో ఆయన పేరే ఉందని పుతిన్‌కు తెలుసు. మేం చేరువగా వస్తున్నామని పుతిన్‌ గుర్తించారు. అలాగే సొంత వ్యక్తుల చేతిలో ప్రాణాలు కోల్పోతాననే భయంతో జీవిస్తున్నారు. మా జాబితాలో పుతిన్‌తో పాటు రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూపు అధిపతి యెవ్‌గెనీ ప్రిగోజిన్‌, రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు, ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. పుతిన్‌ను టార్గెట్‌ చేయడం కష్టసాధ్యం. ఎందుకంటే ఆయన ఎక్కువగా సురక్షిత ప్రాంతాలకే పరిమితం అవుతున్నారు. కానీ, ఇటీవల తరచూ బహిరంగ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు’అంటూ ఉక్రెయిన్‌ మిలిటరీ ఇంటిలిజెన్స్‌ సర్వీస్‌కు చెందిన వాదిమ్‌ స్కిబిట్స్కీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ని సదరు మీడియా ఆరా తీసింది. పుతిన్‌ను రక్షించే చర్యల ముమ్మరం చేయనున్నారా అని పెస్కోవ్‌ని ప్రశ్నించగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మమ్మల్ని నమ్మండి, మా భద్రత కోసం ఏం చేయాలో మాకు తెలుసు’ అన్నారు.
సరిగ్గా 15 నెలల క్రితం ఉక్రెయిన్‌లో రష్యా ప్రత్యేక ఆపరేషన్‌ పేరుతో ప్రారంభించిన ఈ యుద్ధం సరైనదని స్కిబిట్స్కీ ఇంటర్యూ చెప్పకనే చెప్పిందని విమర్శించారు. ఒకరకంగా ఈ ప్రత్యేక ఆపరేషన్‌ని సమర్థించబడటమే గాక అవసరమైన దానికంటే ఎక్కువ లక్ష్యాలను సాధించడం ద్వారా దాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు పెస్కోవ్‌.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img