Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రముఖ కార్మిక నాయకుడు ట్రుమ్కా మృతి

వాషింగ్టన్‌: అమెరికాలో ప్రముఖ కార్మిక నాయకుడు,ఉద్యమ నేత రిచర్డ్‌ ట్రుమ్కా (72) మృతిచెందారు. బొగ్గుగనుల మాజీ కార్మికుడు, కార్మికుల హక్కుల ప్రచారకర్త ట్రుమ్కా కోటి ఇరవై ఐదులక్షల మంది కార్మికులు, ఉద్యోగాలకు ప్రాతినిధ్యం వహించే కార్మిక సంఘాల సమాఖ్యకు ప్రాతినిధ్యం వహించారు. ఫిలడెల్ఫియా, ఒహియాలోని లేబర్‌ గ్రూపులు ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తూ ట్వీట్‌చేశారు. అమెరికా చట్టసభ సభ్యులు ట్రుమ్కా మృతిపై సంతాప సందేశాలను పోస్ట్‌ చేశారు. అమెరికాలోని ప్రముఖ ట్రేడ్‌ యూనియన్‌ల ఫెడరేషన్‌ అయిన ‘అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ ఇండస్ట్రీయల్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఎఫ్‌ఎల్‌-సీఐఓ)’ అధ్యక్షుడిగా ఆయన దీర్ఘకాలం పనిచేశారు.1982లో 33 సంవత్సరాల వయస్సులో, యునైటెడ్‌ మైన్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన అతి పిన్న వయస్కుడు ట్రుమ్కా. బొగ్గుగని కార్మికులను ఐక్యపర్చడంలో ట్రుమ్కా కీలక పాత్ర వహించారు. 2009లో ఆయన ఎఎఫ్‌ఎల్‌-సీఐఓకి అధ్యక్షుడయ్యారు. 39 సంవత్సరాల వయస్సులో వర్జీనియాలోని బొగ్గు గని కార్మికుల 15 నెలల సమ్మె పోరాటానికి నాయకత్వం వహించారు. ఈ పోరాటంతో కార్మికులకు ఆరోగ్య భద్రత, పెన్షన్‌ హక్కుల రక్షణలో విజయం సాధించారు. సమ్మెకాలంలో విధుల నుంచి తొలగించిన 4000 మంది కార్మికులకు మళ్ళీ ఉద్యోగాలు వచ్చేవరకు పోరాడి పునర్నియామకం జరిగేందుకు కృషిచేశారు. ట్రుమ్కా మృతికి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, హిల్లరీ క్లింటన్‌, అనేక కార్మిక సంఘాల నాయకులు సంతాపం ప్రకటించారు. ట్రుమ్కా మరణం కార్మికులకు, నిజంగా కష్టపడి పనిచేసే అమెరికన్లందరికీ తీవ్ర నష్టంగా స్పీకర్‌ పెలోసి పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మాట్లాడుతూ ట్రుమ్కా తనకు వ్యక్తిగత స్నేహితుడని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img