హెల్సింకీ : ఫిన్లాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష నేషనల్ కోయలిషన్ పార్టీ విజయం సాధించింది. ఫిన్లాండ్ జాతీయ ప్రసారకర్త యెల్ నివేదించిన ప్రాథమిక ఫలితాల ప్రకారం ఆదివారం జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఫిన్లాండ్ ప్రతిపక్ష నేషనల్ కోయలిషన్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఫిన్లాండ్ నేషనల్ కోయలిషన్ పార్టీ నాయకుడు పెట్టెరి ఓర్పో ఈ సందర్భంగా హెల్సింకిలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తమ విజయానికి కారకమైన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో నేషనల్ కోయలిషన్ పార్టీ 48 సీట్లు గెలుచుకుంది. నాలుగేళ్ల క్రితం కంటే సీట్ల సంఖ్య పదికిపైగా పెరిగింది, ఫిన్స్ పార్టీ 46 సీట్లలో ఏడు పెరిగాయి. ప్రధానమంత్రి సన్నా మారిన్ అధ్యక్షతన ఉన్న ప్రస్తుత ఫిన్లాండ్్ సంకీర్ణంలో ప్రధాన పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ 3 స్థానాలు పెరిగి 43 స్థానాలను గెలుచుకుంది. ఈ దఫా ఓటింగ్ శాతం 71.9శాతం నమోదైంది. జాతీయ కూటమి పార్టీ నాయకుడు పెట్టేరి ఓర్పో మాట్లాడుతూ, ఇది పార్టీకి ముఖ్యమైన విజయమని, తన నాయకత్వంలో నూతనతరహా ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. నేషనల్ కోయలిషన్ పార్టీ, ఫిన్స్ పార్టీ ఎన్నికల ఫలితాలపై మారిన్ అభినందనలు తెలిపారు. తన పార్టీ పనితీరుపై తాను కూడా సంతృప్తిగా ఉన్నానని పేర్కొన్నారు. సెంటర్ పార్టీ ఎనిమిది స్థానాలను కోల్పోయింది, గ్రీన్స్ ఏడు స్థానాలను కోల్పోయింది లెఫ్ట్ అలయన్స్ పార్టీ ఐదు స్థానాలను కోల్పోయింది. రెండు మితవాద పార్టీలైన నేషనల్ కోయలిషన్ పార్టీ, ఫిన్స్ పార్టీలు కలిసినప్పటికీ పార్లమెంటులో తమ మెజారిటీకి తక్కువగా ఉన్నందున సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలకు కొంత సమయం పట్టవచ్చని ప్రభుత్వ ఏర్పాటుకు చిన్న పార్టీల మద్దతు అవసరమని ఓర్పో పేర్కొన్నారు.