Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఫిలిప్పీన్స్‌లో నల్గే బీభత్సం

. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం
. 72కు పెరిగిన మృతులు వందలాది మంది గల్లంతు
. నేలకూలిన చెట్లు నీటిలో కొట్టుకుపోయిన ఇళ్లు
. నిలిచిన విమానాలు` ఇబ్బందుల్లో వేలాది మంది ప్రయాణికులు
. సురక్షిత ప్రాంతాలకు ఏడు వేల మంది

మనీలా: నల్గే తుపాను ఫిలిప్పీన్స్‌లో బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, మెరుపు వరదలు ముంచెత్తాయి. విరిగిపడ్డ కొండచరియలు, మట్టిపెళ్లలు అల్లాడిరచాయి. శనివారానికి 72 మంది మృతి చెందగా వందలాది మంది గల్లంతయ్యారు. దాదాపు 500 ఇళ్లు ధ్వంసమయ్యాయి. రాజధాని మనీలాతో పాటు అనేక ప్రాంతాలు వరదల గుప్పిట్లో చిక్కుకోగా సముద్రం అల్లకల్లోలంగా ఉండి గంటకు 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తీరప్రాంతాలను అతలాకుతలం చేశాయి. చెట్లు నేలకూలగా ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా ఇళ్లు నీటమునిగాయి. కొన్ని కొట్టుకుపోయాయి. విమానసేవలు నిలిచిపోయి వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. దక్షిణ ఫిలిప్పీన్స్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. మూడు లక్షల జనాభా ఉన్న కోటాబాటో నగరం వణికిపోయింది. కొండచరియలు విరిగి పడి వందలాది మంది గల్లంతైనట్లు అధికారులు పేర్కొన్నారు. లక్ష కుటుంబాలు ముంపునకు గురైనట్టు వెల్లడిరచారు. దాతు ఒడిన్‌ సిసువాత్‌ పట్టణం సమీపంలోని కుసియోంగ్‌ అనే గిరిజన గ్రామంలోనే 60 మంది వరకు మరణించినట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో జనం గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. ఈ గ్రామంలో 80 కుటుంబాలు ఉంటాయని చెప్పారు. శుక్రవారం వెలికితీసిన 11 మృతదేహాలలో చిన్నారులవే ఎక్కువగా ఉన్నట్లు ఐదు ప్రావిన్సుల అంతర్గత మంత్రి నాగ్యుబ్‌ సినారింబో వెల్లడిరచారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే హెచ్చరించడంతో ప్రాణనష్టం తగ్గిందని, అనేక మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు చేర్చాయని చెప్పారు. ఏడు వేల మందిని ఆర్మీ, పోలీసులతో పాటు వలెంటీర్లు కాపాడినట్లు తెలిపారు. వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. శుక్రవారం రాత్రికి మగ్యుడానోలో మృతుల సంఖ్య 67కు చేరినట్లు అధికారులు వెల్లడిరచారు. ఆర్మీ అధికారుల ప్రకారం 42 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సంభవించిన తుపాన్లలో ఇది 16వది.. గంటలకు 95కిమీల నుంచి 130కిమీల వేగంతో గాలులు వీచి మనీలాతో పాటు అనేక ప్రావిన్సులు, నగరాల్లో బీభత్సం సృష్టించిందని ప్రభుత్వ వాతావరణ కేంద్రానికి చెందిన ఫోర్‌కాస్టర్‌ శామ్‌దురన్‌ తెలిపారు. ఏటా 20 వరకు తుపాన్లు, టైఫూన్లు ఫిలీప్పీన్స్‌ను అల్లడిస్తుండటం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img