Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఫ్రాన్స్‌ కార్మిక సంఘాల ఉద్యమం


స్తంభించిన రవాణా వ్యవస్థ` నిలిచిన రైళ్లు, విమానాలు
పారిస్‌: ఫ్రాన్స్‌లో మాక్రాన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానపరమైన నిర్ణయాలపై ప్రజాగ్రహం కట్టులు తెంచుకుంది. పదవీ విరమణ వయస్సును 62 నుంచి 64కు పెంచుతూ ప్రభు త్వం చట్టం తేవడం, ఓటింగ్‌ లేకుండా పార్లమెంటు ఆమోదించ డంతో పరిస్థితి మరింత జఠిలమైంది. పింఛన్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా జనవరి నుంచి జరుగుతున్న ఆందోళనలు, సమ్మెలు, నిరసనలు, ప్రదర్శనలు మరింత తీవ్రంరూపం దాల్చాయి. దీంతో గురువారం ఫ్రాన్స్‌ అట్టుడికిపోయింది. కార్మిక సంఘాలు ఉద్యమించడంతో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది. రైల్వేస్టేషన్లను, బస్‌ డిపోలను, ప్రధాన కూడళ్లను నిరసనకారులు దిగ్బంధించారు. సామూహిక నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పారిస్‌లోని చార్లస్‌ డి గౌలే విమానాశ్రయం, రిఫైనరీలలో పని ఆగిపోయింది. హైస్పీడ్‌ రైళ్లతో పాటు స్థానికంగా నడిచే రైళ్లు నిలిచిపోయాయి. పారిస్‌ మెట్రోతో పాటు ప్రధాన నగరాల్లో ప్రజా రవాణా స్తంభించింది. ఓర్లీ విమానంలో 30శాతం విమానాలు రద్దయ్యాయి. పింఛన్‌ సంస్కరణకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రరూపం దాల్చిన క్రమంలో కొన్ని చోట్ల హింస కూడా చోటుచేసుకుంది. ‘ఆయనేమీ నియంత కాదు. ప్రజల మాట వినాల్సిందే. వారు ఏం కోరుకుంటున్నారు. వారి అవసరాలు ఏమిటన్నది పరిగణనలోకి తీసుకోవాలి’ అని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా పార్లమెంటులో రెండు అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టగా మాక్రాన్‌ ప్రభుత్వం తృటిలో తప్పించుకొన్నది. స్వల్ప మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. ఫ్రాన్స్‌లో పింఛన్‌ సంస్కరణలు అవసరమని, రిటైర్మెంట్‌ వ్యవస్థను సవరించాల్సిందేనని మాక్రాన్‌ బలంగా వాదిస్తున్న విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img