Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బ్రిటన్‌ ప్రధాని సునాకానా, జాన్సనా?

లండన్‌ : బ్రిటన్‌ ప్రధానిగా లిజ్‌ట్రస్‌ గురువారం రాజీనామా చేసిన తరువాత బ్రిటన్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కన్జర్వేటీవ్‌ పార్టీ నిర్వాహకులు ఎన్నికల ప్రక్రియను ప్రకటించారు. దీని ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహ అభ్యర్థులు సోమవారం మధ్యాహ్నానికల్లా తమ సహచరుల నుండి మద్దతుగా 100 నామినేషన్లు సంపాదించవలసి వుంటుంది. కన్జర్వేటీవ్‌ ఎంపీల నుండి కొన్ని డజన్ల నామినేషన్లు పొందిన మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సంచలనాత్మకంగా తిరిగి ప్రధాని పదవి చేపడతారని భావిస్తున్నారు. 45 రోజులు మాత్రమే అధికారంలో ఉన్న ట్రస్‌ గురువారం రాజీనామా ప్రకటన అనంతరం కొన్ని నెలల రాజకీయ గందరగోళం అంతానికి త్వరగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. బ్రిటీష్‌ వార్తాపత్రికలు లండన్‌లోని నెం.10 డౌనింగ్‌ స్ట్రీట్‌లో గల ట్రస్‌ నివాసం వెలుపల విషాద వదనంతో ఆమె చివరి ప్రసంగం చిత్రాలను ప్రచురించాయి. అతివాద పత్రిక గార్డియన్‌ మొదటి పేజీలో ‘‘విషాదకర ముగింపు’’ శీర్షికతో వార్త ప్రచురించింది. బ్రిటన్‌లో జీవన వ్యయం సంక్షోభాన్ని ప్రక్షాళన చేస్తానని ప్రమాణం చేస్తూ ప్రత్యర్ధి రిషి సునాక్‌కి వ్యతిరేకంగా వారం రోజులు ప్రచారం చేసిన అనంతరం సెప్టెంబరు 6న బోరిస్‌ జాన్సన్‌ స్థానంలో ట్రస్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు. ట్రస్‌ పన్నుల తగ్గింపు హామీలు వినాశకర పరిణామాలకు దారి తీస్తాయని సరిగానే హెచ్చరించిన మాజీ ఆర్థికమంత్రి సునాక్‌, ట్రస్‌ వారసుడిగా ఆవిర్భవించారు. అయితే, గతంలో ప్రధానిగా ఉండగా కుంభకోణాలు మూటగట్టుకున్న జాన్సన్‌ కూడా నాటకీయంగా ప్రధాని ఎన్నికల బరిలోకి దిగారు. ఇప్పటివరకు లాంఛనంగా పోటీదారులు ఎవరు ఎవరన్నది వెల్లడికానప్పటికీ సునాక్‌, జాన్సన్‌, సీనియర్‌ కేబినెట్‌ సభ్యుడు పెన్నీ మోర్డాంట్‌ల మధ్యే ప్రధాని పదవికి పోటీ ఉంటుందని విస్తృతంగా భావించబడుతున్నది.
శుక్రవారం ఉదయానికల్లా జాన్సన్‌కు 52, సునాక్‌కు 47, మోర్డాంట్‌కు కేవలం 18 నామినేషన్లు మాత్రమే లభించినట్లు టోరీ ఎంపీల రాజకీయ వెబ్‌సైట్‌ గైడోఫాక్స్‌ వెల్లడిరచింది. అయితే జాన్సన్‌ తనకు మద్దతు ఇవ్వవలసిందిగా ఎంపీలను అభ్యర్థిస్తున్నాడు. టోరీ పార్టీ ఎంపీ క్రిస్‌పిన్‌ బ్లంట్‌ సునాక్‌ మాత్రమే దేశానికి ‘‘తీవ్ర సందేశం’’ ఇవ్వగలడని బీబీసీకి చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img