Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

భారత్‌ హైకమిషన్‌ భద్రతకు ఢోకా లేదు

. ఖలిస్థాన్‌ వేర్పాటువాదుల చర్య అవమానకరం
. నిందితులను అరెస్టు చేశామన్న బ్రిటన్‌ అధికారులు

లండన్‌: లండన్‌ లోని భారత హైకమిషన్‌ కార్యాలయ భద్రతను బ్రిటన్‌ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందనీ, ఖలిస్థాన్‌ వేర్పాటువాదుల విధ్వం సం తమ దేశానికే అవమానకరమని, ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని బ్రిటిష్‌ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. భారత హైకమిషన్‌ పై ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని నిరసనకారులు ఆదివారం ఖలిస్తానీ అనుకూల నినాదాలు చేస్తూ కిందకు దించారు. భవనంపై దాడి చేశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలోనే హింసాత్మక పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈ ఘటనకు సంబంధించి కొంతమందిని అరెస్టు చేశామని, భారత త్రివర్ణ పతాకం ఇప్పుడు గొప్పగా ఎగురు తోందని సంబంధిత అధికారులు తెలిపారు. కాగా, ఖలిస్థాన్‌ అనుకూల వాదులు భారత ఎంబసీ వద్ద జాతీయ జెండాను దించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బందిలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యా యని మెట్రోపాలిటన్‌ పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన లండన్‌ మేయర్‌ సాధిక్‌ ఖాన్‌ హింసాత్మక ఘటనను, విధ్వంసాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రవర్తనకు మన నగరంలో చోటు లేదని ట్వీట్‌ చేశారు. ఈ ఘటన సిగ్గుచేటని, పూర్తిగా ఆమోదయోగ్యం కాదని భారత్‌లోని బ్రిటిష్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ పేర్కొన్నారు. వింబుల్డన్‌ విదేశాంగ మంత్రి లార్డ్‌ తారిఖ్‌ అహ్మద్‌ మాట్లా డుతూ… భారత హైకమిషన్‌ భద్రతను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పారు. మిషన్‌, సిబ్బంది సమగ్రతకు వ్యతిరేకంగా ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాని చర్య అని ఆయన ట్వీట్‌ చేశారు. భారత హైకమిషన్‌ భవనం వద్ద కిటికీలు పగిలిపోయాయని మెట్రోపాలిటన్‌ పోలీసులు తెలి పారు. ఖలిస్థాన్‌ అనుకూల వాదుల అక్కడకు వచ్చా రన్న సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడి చేరుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలోనే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణను ప్రారంభించినట్లు తెలిపారు.
బ్రిటన్‌కు తీవ్ర నిరసన తెలిపిన భారత్‌
తమ దౌత్య కార్యాలయం భద్రతా వైఫల్యంపై బ్రిటన్‌ ప్రభుత్వానికి భారత్‌ తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. ప్రాంగణంలో తగినంత భద్రత లేకపోవడం గురించి ప్రశ్నించింది. పగిలిన కిటికీలు, ఇండియా హౌస్‌ భవనంపైకి ఎక్కిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మిషన్‌ మొదటి అంతస్తు కిటికీ గుండా ఒక భారతీయ అధికారి ఒక నిరసనకారుడి నుంచి జెండాను లాక్కోగా, నిరసనకారుడు దాని అంచుకు వేలాడుతూ ఖలిస్తాన్‌ జెండాను ఎగురవేస్తూ కనిపించాడు. లండన్‌ లోని భారత హైకమిషన్‌ కు వ్యతిరేకంగా వేర్పాటువాద, తీవ్రవాద శక్తులు తీసుకున్న చర్యలపై భారత్‌ తమ నిరసన తెలుపడానికి న్యూదిల్లీలోని సీనియర్‌ బ్రిటన్‌ దౌత్యవేత్తను ఆదివారం సాయంత్రం పిలిపించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తెలిపింది. హైకమిషన్‌ ఆవరణ వద్ద పూర్తిస్థాయిలో భద్రత లేకపోవడంపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వియన్నా కన్వెన్షన్‌ ప్రకారం యూకే ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతలను గుర్తు చేశారని ఎంఈఏ ఒక ప్రకటనలో వివరించింది. బ్రిటన్‌లోని భారత దౌత్య కార్యాలయాలు, సిబ్బంది భద్రతపై అక్కడి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఈ ఘటనతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ గుర్తించి, అరెస్టు చేసి ప్రాసిక్యూట్‌ చేసేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందనీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img