Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మలేషియాలో అస్థిరతకు చెక్‌ !


అధికార, ప్రతిపక్ష కూటమి మధ్య పార్లమెంటు సాక్షిగా ఒప్పందం
అనేక సంస్కరణలపై ప్రధాని ఇస్మాయిల్‌ సబ్రి హామీ
కౌలాలంపూర్‌ : రాజకీయ అస్థిరత నెలకొన్న మలేషియాలో అధికార, ప్రతిపక్ష కూటముల మధ్య సామరస్య ఒప్పందం కుదిరింది. ఓటర్ల అర్హత వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించేలా చట్టం చేయడంతో పాటు అనేక అంశాలపై రెండు కూటములు ఓ అవగాహనకు వచ్చాయి. ప్రధాని ఇస్మాయిల్‌ సబ్రి యాకోబ్‌, తన ప్రభుత్వాన్ని సుస్థిరపర్చుకోవడానికి అన్వర్‌ ఇబ్రహీం నేతృత్వంలోని ప్రతిపక్షాన్ని సంతృప్తిపరిచేలా వివిధ సంస్కరణలకు హామీ ఇస్తూ ‘రాజకీయ స్థిరత్వం, పరివర్తన’ ఒప్పందంపై సోమవారం చట్టసభలో సంతకం చేశారు. తద్వారా రెండేళ్లలో జరగనున్న ఎన్నికల వరకూ తన ప్రభుత్వానికి ఢోకా లేకుండా ప్రతిపక్ష మద్దతు కూడగట్టుకున్నారు. మలేసియాలో 2018 ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయింపులు పెరిగి ముగ్గురు ప్రధానులు మారారు. ఈ క్రమంలో ఇస్మాయిల్‌ సంస్కరణల ప్రతిపాదనలు తెచ్చారు. పార్టీ ఫిరాయింపులను నిరోధించడానికి చట్టం తీసుకొస్తానని ప్రతిపక్షానికి హామీ ఇచ్చారు. ప్రధాని పదవీకాలాన్ని 10 ఏళ్లకు తగ్గించేలా చట్టం చేస్తామన్నారు. నూతన బిల్లుల విషయంలో ప్రతిపక్ష ఆమోదాన్ని తప్పనిసరి చేస్తామని, దేశ ఆర్థిక పునరుద్ధరణ కోసం వారి సలహాలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. కేబినెట్‌ మంత్రి హోదాతో సమానంగా ప్రతిపక్ష నేతకు వేతనం, ఇతర సౌకర్యాలు అందించడానికి అంగీకరించారు. ఓటర్ల అర్హత వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించేలా వెనువెంటనే చట్టం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షం తాజా ఒప్పందానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాన్ని మలేషియా రాజు అబ్దుల్లా సుల్తాన్‌ అహ్మద్‌ షా ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img