Friday, April 19, 2024
Friday, April 19, 2024

మాది ఆత్మీయబంధం

జెలెన్‌స్కీ బ్రిటన్‌ పర్యటనపై రిషిసునక్‌
లండన్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోడిమిర్‌ జెలెన్‌స్కీ బుధవారం బ్రిటన్‌ చేరుకున్నారు. జెలెన్‌స్కీ తమ దేశంలో పర్యటించడం బ్రిటన్‌కు ఉక్రెయిన్‌కు మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని ప్రతిబింబింపజేస్తుందని బ్రిటన్‌ ప్రధాని రిషిసునక్‌ అన్నారు. ఉక్రెయిన్‌కు తమ మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని హామీనిచ్చారు. ఆ దేశ సైనికులకు అవసరమైన శిక్షణను తమ దేశంలో ఇవ్వడానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. అయితే రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత జెలెన్‌స్కీ మొదటిసారి బ్రిటన్‌లో పర్యటించారు. అయితే ఇది ఆయన రెండవ విదేశీయానం. గతేడాది డిసెంబరులో ఆయన అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన బ్రిటన్‌ ప్రధాని రిషిసునాక్‌తో చర్చలు నిర్వహించి, పార్లమెంటులో ప్రసంగిస్తారు. బ్రిటన్‌ సైన్యాధికారులతోనూ భేటీ అవుతారు. రష్యాతో ఏడాదిగా జరుగుతున్న యుద్ధం క్రమంలో ఉక్రెయిన్‌కు బ్రిటన్‌ వెన్నుదన్నుగా నిలిచింది. 2.5 బిలియన్‌ డాలర్లకుపైగా విలువచేసే ఆయుధాలు, పరికరాలను అందించింది. ఉక్రెయిన్‌ పైలెట్లకు నాటో స్టాండర్డ్‌ ఫైటర్‌ జెట్లతో శిక్షణ ఇస్తోంది. 10వేల మందికిపైగా ఉక్రెయిన్‌ దళాలు ఇప్పటికే బ్రిటన్‌ శిబిరాల్లో శిక్షణ పొందాయి. ఛాలంజర్‌ 2 ట్యాంకులనూ బ్రిటన్‌ పంపింది. జెలెన్‌స్కీ పర్యటన ఆ దేశ ధైర్యాన్ని, పోరాటస్ఫూర్తి, బ్రిటన్‌తో ఆత్మీయ బంధానికి అద్దంపట్టినట్లు రిషి సునక్‌ పేర్కొన్నారు. 2014 నుంచి సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేలా ఆ దేశ దళాలకు బ్రిటన్‌లో కీలకశిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌ సైనికులు, మెరైనర్లు, పైలట్లకు శిక్షణ ఇస్తుండటం సంతోషంగా ఉందన్నారు. తాత్కాలికంగా సైనిక సామగ్రి ఇవ్వడమే కాకుండా.. ఆ దేశంతో దీర్ఘకాలం కలిసి ఉంటామని ఆయన చెప్పారు. బ్రిటన్‌ పూర్వ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తోనూ జెలెన్‌స్కీకి సత్సంబంధాలు ఉండటం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img