Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

యుద్ధంపై నిరసన ఉద్యమాలు

మిలాన్‌: ‘‘ఆయుధాలను అణచివేయండి, వేతనాలు పెంచండి’’ అనే నినాదంతో, సామ్రాజ్యవాద యుద్ధానికి,ఉక్రెయిన్‌కు ఆయుధాల రవాణాకు వ్యతిరేకంగా జెనోవా, ఇటలీలోని ఇతర ప్రధాన నగరాల్లో గత వారంరోజులుగా వేలాది మంది డాక్‌వర్కర్లు, విద్యార్థులు పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. యూఎస్‌బీ (యూనియన్‌ సిండకేల్‌ డి బేస్‌) ట్రేడ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలోఈ సమ్మెకు పిలుపునిచ్చారు. రోమ్‌, మిలన్‌, టురిన్‌, బోలోగ్నా సహా ఇతర నగరాల్లో ప్రదర్శనలు జరిగాయి. ఈప్రదర్శనల్లో వేలాదిమంది పాల్గొన్నారు. జెనోవా పోర్ట్‌లో, యూఎస్‌బీ డాక్‌వర్కర్స్‌ నేతృత్వంలో నిరసనకారులు బ్యానర్లు, జెండాలను పట్టుకుని, ‘‘యుద్ధానికి వ్యతిరేకంగా యుద్ధం’’ వంటి నినాదాలు చేస్తూ సామ్రాజ్యవాద ప్రణాళికలలో ఇటలీ భాగస్వామ్యంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఇటలీ దేశ చట్టం 185/1990 ఆయుధాల ఎగుమతిని నియంత్రిస్తుంది, వాస్తవానికి సాయుధ పోరాటంలో పాల్గొన్న దేశాలకు ఆయుధాల ఎగుమతిని నిషేధించింది. అయితే, 2022లో ప్రభుత్వం ఉక్రెయిన్‌కు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేయడానికి అనుమతించే చట్టాన్ని అధిగమిస్తూ ఒక డిక్రీని ఆమోదించింది. ఉక్రెయిన్‌లో యుద్ధం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా విద్యార్థులు, యువజన సంఘాలచే సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. ఈ ప్రదర్శనలకు ఫ్రంట్‌ ఆఫ్‌ ది కమ్యూనిస్ట్‌ యూత్‌(ఫ్రంట్‌ డి లా గియోవెంటు కమ్యూనిస్టా), కమ్యూనిస్ట్‌ ఫ్రంట్‌ (ఫ్రంటే కమ్యూనిస్టా) హాజరయ్యాయి. ఉక్రెయిన్‌లో నాటో-రష్యా యుద్ధ 1వ వార్షికోత్సవం సందర్భంగా కమ్యూనిస్ట్‌ యూత్‌ ఫ్రంట్‌ ఒక ప్రకటన చేసింది. యూరప్‌ను రక్తసిక్తంచేసే పెట్టుబడిదారీ దేశాల మధ్య జరిగే ఈ యుద్ధం ప్రపంచాన్ని మరింత అగాధంలోకి లాగుతోంది. ఉక్రెయిన్‌లో సాగుతున్నది సామ్రాజ్యవాద పెత్తందారీ యుద్ధం. ఈ యుద్ధంలో తాము పాల్గొనమని సంకోచం లేకుండా యుద్ధానికి నిరసన ప్రకటించాలని కార్మికులకు ముఖ్యంగా యువతకు కమ్యూనిస్టు యూత్‌ పిలుపునిచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img