Friday, April 19, 2024
Friday, April 19, 2024

యుద్ధ విన్యాసాలు విజయవంతం: చైనా

బీజింగ్‌: తైవాన్‌ చుట్టూ మూడు రోజులపాటు చేపట్టిన యుద్ధ విన్యాసాల్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు చైనా ప్రకటించింది. ఈ విన్యాసాలు ‘వాస్తవ పోరాట పరిస్థితుల్లో బహుళ సైనిక శాఖల సమగ్ర ఉమ్మడి పోరాట సామర్థ్యాన్ని సమగ్రంగా పరీక్షించింది’ అని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) తూర్పు కమాండ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. చైనా గతంలో ఎన్నడూ పీఎల్‌ఏ దళాలు ఇటువంటి విన్యాసాలు చేయలేదని, దీని వల్ల చైనా విమాన వాహక నౌకలకు, పైలట్లకు వాస్తవ పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే విషయంపై అవగాహన వస్తుందని భావిస్తున్నారు. కాగా క్షిపణులతో అత్యంత కచ్చితంగా లక్ష్యాలను ఛేదించడాన్ని తాము సాధన చేసినట్లు పీఎల్‌ఏ తూర్పు కమాండ్‌ వెల్లడిరచిందని చైనా అధికారిక మీడియా తెలిపింది. యుద్ధ విన్యాసాల్లో భాగంగా తైవాన్‌ గగన తలాన్ని డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు చుట్టుముట్టాయి. తైవాన్‌ వద్ద సిములేటెడ్‌ స్ట్రైక్స్‌ నిర్వహించినట్లు పీఎల్‌ఏ వెల్లడిరచింది. చైనా చెందిన షాన్‌డాంగ్‌ యుద్ధ నౌక… తైవాన్‌ జలాల్లో సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఆదివారం కూడా భారీ స్థాయిలో చైనా సైనిక సత్తాను ప్రదర్శించింది. తైవాన్‌ దీవిలో ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని లైవ్‌ డ్రిల్స్‌ నిర్వహించారు. హెచ్‌-6కే ఫైటర్‌ జెట్లతో అటాక్‌ చేసినట్లు పీఎల్‌ఏ తూర్పు కమాండ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్రిక్తతల సమయంలో తైవాన్‌పై పీఎల్‌ఏ ఎలా స్పందిస్తుందనే విషయాన్ని ఈ విన్యాసాలు వెల్లడిరచినట్లు రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయి యింగ్‌ వెన్‌ అమెరికాలో పర్యటించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముదిరాయి. వెన్‌ పర్యటనపై ఆగ్రహంతో ఉన్న చైనా… శనివారమే తైవాన్‌ వైపుగా ఎనిమిది యుద్ధ నౌకలు, దాదాపు 70 ఫైటర్‌ జెట్లను మోహరించింది. ఈ నేపథ్యంలో యుద్ధ నౌకలతో తమపై దాడులకు చైనా సన్నాహాలు చేస్తోందని తైవాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన తైవాన్‌.. ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో విన్యాసాలు జరుగుతున్నాయని తెలిపింది. ప్రస్తుత విన్యాసాల్లో తొలిసారిగా పీఎల్‌ఏకి చెందిన జె-15 ఫైటర్‌ జెట్‌లు పాల్గొన్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్ల నుంచి ఎగిరి తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ ఐడెంటిఫికేషన్‌ జోన్‌ (ఏడీఐజెడ్‌)లోకి ప్రవేశించాయి. కాగా చైనా తమ ప్రాదేశిక జలాలుగా చెప్పుకుంటోన్న ప్రాంతంలోకి అమెరికా యుద్ధ నౌకను మోహరించింది. సంయమనం పాటించాలని చైనాకు పదేపదే పిలుపునిచ్చిన అమెరికా… సోమవారం దక్షిణ చైనా సముద్రంలోని పోటీ ప్రాంతాల గుండా గైడెడ్‌-మిసైల్‌ డిస్ట్రాయర్‌ యూఎస్‌ఎస్‌ మిలియస్‌ను పంపింది. ‘ఈ నావిగేషన్‌ ఆపరేషన్‌ సముద్ర హక్కులు, స్వేచ్ఛ, చట్టబద్ధమైన ఉపయోగాలను సమర్థిస్తుంది’ అని అమెరికా నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది. వివాదాస్పద స్ప్రాట్లీ దీవుల సమీపంలో యుద్ధ నౌక ప్రయాణించినట్టు అమెరికా పేర్కొంది. ఈ పరిణామపై చైనాను మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఈ నౌక తన ప్రాదేశిక జలాల్లోకి చట్టవిరుద్ధంగా చొరబడిరదని స్పష్టం చేసింది. మరోవైపు, తైవాన్‌ రక్షణ శాఖ స్పందిస్తూ వివాదాలు తలెత్తకుండా, పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా తాము ఓర్పుతో వ్యవహరిస్తున్నట్లు తెలిపింది. అలాగే, చైనాకు ప్రతిస్పందనగా స్పీడ్‌ బోట్‌లు, తీరంలోని యాంటీషిప్‌ క్షిపణి వాహనాలతో యుద్ధ విన్యాసాలు చేసింది. తైవాన్‌ను కొన్ని విదేశీ శక్తులు ఎగదోస్తున్నాయని, ఇది యుద్ధానికి దారితీసే అవకాశం లేకపోలేదు అని గతంలోనే చైనా హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img