Friday, April 19, 2024
Friday, April 19, 2024

శిథిలాలు తవ్వే కొద్దీ శవాలు

. కొనసాగుతున్న సహాయక చర్యలు
. టర్కీ, సిరియాలో 35వేలకు చేరిన మరణాలు
. దక్షిణ టర్కీలో మరోసారి భూకంపం

అంకారా: టర్కీపై భూకంపం పగబట్టిన ట్టుంది. మరోసారి ఆ దేశంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 4.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలా జికల్‌ సర్వే తెలిపింది. దక్షిణ టర్కీ నగరమైన కహ్రామన్‌మరాస్‌కు సమీపంలో 15.7 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొంది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు భూకంపం సంభవించినట్టు వివరించారు. ప్రకృతి విలయానికి గత వారం రోజులుగా టర్కీ వాసులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గడుపుతున్నారు. భూకంపం సృష్టించిన విధ్వంసానికి ఊళ్లకు ఊళ్లే తుడుచుపెట్టుకుపో యాయి. చారిత్రక నగరాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వేలాది భవనాలు నేలమట్టమ య్యాయి. టర్కీ, సిరియాలో గత సోమవారం సంభవించిన భారీ భూకంపం కారణంగా ఇప్పటివరకు 34 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. టర్కీలో 30 వేలు, సిరియాలో 5వేల మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. 92,600 మంది గాయపడ్డారు. టర్కీ, సిరియాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయడం లేదు. శిథిలాల నుంచి ఆరు రోజుల తర్వాత కూడా కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు. తాజాగా ఆరు నెలల గర్భిణీ, ఇద్దరు పిల్లలతో సహా కొంతమంది సురక్షితంగా బయటకు వచ్చారు. అయితే, భూకంపంలో అధిక ప్రాణనష్టానికి అక్రమ నిర్మాణ కార్యకలాపాలే కారణమని టర్కీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 130 మందికిపైగా కాంట్రాక్టర్లను టర్కీ న్యాయ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు ఇక్కడి పరిస్థితులను ఆసరాగా చేసుకుని దోపిడీలకు, మోసాలకు పాల్పడుతున్న ముఠాలను కట్టడి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. భూకంపం కారణంగా కుప్పకూలిన భవనాల నిర్మాణాలకు బాధ్యులైన 134 మందిని విచారిస్తున్నట్లు టర్కీ న్యాయ శాఖ మంత్రి బెకిర్‌ బోజ్‌డాగ్‌ వెల్లడిరచినట్టు టర్కీ అధికారిక మీడియా అనడోలు తెలిపింది. వీరిలో ఏడుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. చనిపోయినవారి శవాలను ఖననం చేయడానికి భూకంప ప్రభావిత ప్రాంత శ్మశానాల్లో పెద్ద ఎత్తున బుల్డోజర్లు, పొక్లెయిన్‌లు నిరంతరం పని చేస్తుండటం ఈ విలయానికి అద్దం పడుతోంది.
175 గంటల తర్వాత…
ఇక హయట్‌ ప్రావిన్సులో దాదాపు 175 గంటల తర్వాత శిథిలాల కింద ఉన్న ఓ మహి ళను ప్రాణాలతో రక్షించారు. వారం రోజుల తర్వాత కూడా ఆమె శిథిలాల కింద సజీవంగా ఉంది. మహిళను రక్షించిన వీడియోను ఇస్తాంబుల్‌ మున్సిపాలిటీ రిలీజ్‌ చేసింది. ఆమెను నైదీ ఉమేగా గుర్తించారు. కాంక్రీట్‌ శిథిలాల కింద ఉన్న ఆమెను స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. కాగా హటాయ్‌ ప్రావిన్సులోని అంటక్యా ప్రాంతంలో శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తిని 167 గంటల తర్వాత రక్షించారు. ఓ 55 ఏళ్ల మహిళను దాదాపు 159 గంటల తర్వాత కాపాడారు. 85 ఏళ్ల మహిళను 152 గంటల తర్వాత రక్షించారు.
సామూహిక ఖననాలు
టర్కీలోని మరాష్‌ ప్రాంతంలో ఆదివారం నాటికి సుమారు 5 వేల మృతదేహాలను ఒకే ప్రాంతంలో సమాధి చేశారు. శవాలను మోసుకొచ్చే వాహనాల శబ్దం వినిపిస్తూనే ఉందని స్థానిక యంత్రాంగం వెల్లడిరచింది. తమ వారిని ఖననం చేసేందుకు వచ్చినవారి రోదనలు ఆ ప్రాంతంలో మిన్నంటాయి. శ్మశాన వాటిక కోసం పైన్‌ అడవులను కొట్టివేశారు. ఇక సమాధులను తవ్వేందుకు బుల్డోజర్లు, పొక్లెయిన్లు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి. చనిపోయిన వారిని సంప్రదాయ బద్ధంగా పంపించాలని అయినవారు కోరుకుంటున్నారు. ఆ నిమిత్తం అధికారులు తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు. అక్కడ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img