Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే బాధ్యతల స్వీకరణ

శ్రీలంక సంక్షోభంలో కీలక మలుపు చోటు చేసుకుంది. శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రస్తుత ప్రధానమంత్రి రణిల్‌ విక్రమసింఘే బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం మధ్యాహ్నం శ్రీలంక ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు గొటబాయ రాజపక్సే అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్లమెంట్‌ స్పీకర్‌ మహీంద యాపా అబే వర్ధనే అధికారికంగా ప్రకటించారు. తన అసంబద్ధ నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి, దేశాన్ని దివాలా తీయించారని గొటబాయ ప్రజాగ్రహానికి గురయ్యారు. ఆయనకు వ్యతిరేకంగా దేశంలో చాన్నాళ్ల నుంచి పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో, గొటబాయ దేశం విడిచి పారిపోయారు. ఆయన దేశాన్ని విడిచి వెళ్లిన రెండు రోజుల్లోనే తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్‌ బాధ్యతలు తీసుకోవడంతో శ్రీలంక పరిస్థితి గాడిలో పడే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంటు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ముగిసే వరకు ప్రధాని రణిల్‌ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని స్పీకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు శ్రీలంక రాజధాని కొలంబోలో ప్రజల నిరసనలు కొనసాగుతున్నాయి. నగరంలోని అధ్యక్ష భవనం, అధ్యక్షుడి సచివాలయం, ప్రధానమంత్రి అధికారిక నివాసం టెంపుల్‌ ట్రీస్‌ వంటి మూడు ప్రధాన భవనాలను నిరసనకారులు ఆక్రమించారు. గోటబాయ రాజపక్సే గురువారం అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తర్వాత, నిరసనకారులు అధ్యక్ష, ప్రధాని నివాసాలను ఖాళీ చేశారు. ఇప్పుడు అధ్యక్షుడి సచివాలయం ఖాళీ చేయాలా? వద్దా? అనే చర్చ జరుగుతోంది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియలో పాల్గొనడానికి చట్టసభ సభ్యులందరికి శాంతియుత వాతావరణాన్ని కల్పించాలని స్పీకర్‌ మహీందా ప్రజలను కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img