Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

సీజీటీ ప్రధాన కార్యదర్శిగా బినెట్‌ ఎన్నిక

పారిస్‌: జనరల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌ (సీజీటీ) ప్రధాన కార్యదర్శిగా సోఫీ బినెట్‌(41) ఎన్నికను ఫ్రెంచ్‌ కమ్యూనిస్టులు స్వాగతించారు. ఫ్రాన్స్‌లో 1895లో స్థాపించిన రెండవ అతిపెద్ద యూనియన్‌కు నాయకురాలిగా ఎన్నికకావడంపై యూనియన్‌ ప్రజలు హర్షం వెలిబుచ్చారు. లెఫ్ట్‌ వింగ్‌ సభ్యురాలైన బినెట్‌ సీజీటీ మొదటి మహిళా నాయకురాలిగా ఎంపికయ్యారు. దేశంలో పెన్షన్‌ సంస్కరణలపై ప్రభుత్వంతో తన పోరాటాన్ని కొనసాగిస్తానని ఆమె ప్రతిజ్ఞచేశారు. సీజీటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికకావడంపై సంతోషాన్ని వ్యక్తంచేశారు. 128 ఏళ్ల చరిత్రలో వామపక్ష యూనియన్‌ ఫెడరేషన్‌కు నాయకత్వం వహించిన మొదటి మహిళ ఆమె. బినెట్‌, పాఠశాలల సూపర్‌వైజర్‌, జనరల్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌, ఎగ్జిక్యూటివ్‌లు, సాంకేతిక సిబ్బందికి ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్‌లో ఒక విభాగానికి ఆమె అధిపతి. ఫ్రెంచ్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఫాబియన్‌ రౌసెల్‌ సీజీటీ అధిపతిగా ఎన్నికైనందుకు సోఫీ బినెట్‌కు, ఆమె బృందానికి అభినందనలు తెలియజేస్తున్నానని ట్వీట్‌చేశారు. ట్రేడ్‌ యూనియన్‌ ప్రపంచంలో సాటిలేని శక్తిగా పేర్కొన్నారు. దేశంలో పెన్షన్‌ హక్కులపై అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌పై దాడికి ఫ్రెంచ్‌ యూనియన్లు తమ వ్యతిరేకతను కొనసాగించడంతో బినెట్‌ బాధ్యతలు స్వీకరించారు. సీజీటీ ఫ్రాన్స్‌లో రెండవ అతిపెద్ద యూనియన్‌ ఫెడరేషన్‌. దేశంలో పదవీ విరమణ వయస్సును 62 నుండి 64కి పెంచాలనే ప్రభుత్వ ప్రణాళికను నిరోధించే ప్రయత్నంలో భాగంగా ఇతర యూనియన్‌లతోకలిసి సీజీటీ ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేసింది. జనవరి నుంచి యూనియన్లు మాక్రాన్‌ విధానాలకు వ్యతిరేకంగా పలు దఫాలు దేశవ్యాప్త సమ్మెలు, భారీ నిరసనలను చేపట్టారు. వచ్చే వారం చేపట్టనున్న ప్రణాళికలపై చర్చించడానికి యూనియన్‌లకు ప్రధానమంత్రి ఎలిసబెత్‌ బోర్న్‌ నుండి ఆహ్వానం అందినట్లు బినెట్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img