Monday, September 25, 2023
Monday, September 25, 2023

3 లక్షల దళాలు సిద్ధం చేయాలి

లిథువేనియన్‌ సదస్సులో నాటో తీర్మానం
ఉక్రెయిన్‌కు సభ్యత్వంపై కుదరని ఏకాభిప్రాయం

విల్నియస్‌: అంతర్జాతీయ సమాజం నుంచి వ్యతిరేక, సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాల నడుమ లిథువేనియన్‌ రాజధాని విల్నియస్‌లో రెండు రోజులు జరిగిన నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో) సదస్సు బుధవారం ముగిసింది. ఈ సదస్సులో భాగంగా ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగింపు క్రమంలో సమగ్ర రక్షణ ప్రణాళికలను నాటో ఆమోదించింది. కొత్త రక్షణ కార్యాచరణ ప్రణాళికలను ప్రవేశపెట్టింది. కొత్త ప్రణాళికల్లో భాగంగా 3,00,000 దళాలను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచుకోవాలని నాటో లక్ష్యంగా పెట్టుకుంది. తమ వార్షిక జీడీపీలో కనీసం రెండు శాతాన్ని రక్షణ కోసం పెట్టుబడిగా పెట్టేందుకు కట్టుబడి ఉన్నట్లు నాటో మిత్రపక్షాలు వెల్లడిరచినట్లు అధికారిక ప్రకటన పేర్కొంది. 31 మిత్రదేశాల్లో 11 దేశాలు మాత్రమే ఈ లక్ష్యాన్ని 2014 నుంచి ఇప్పటివరకు చేరుకోగలిగినట్లు సదస్సులో విడుదల చేసిన పత్రాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌కు దీర్ఘకాలిక మద్దతు ఇచ్చేందుకు నాటో నేతలు ప్రతిజ్ఞబూనారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కొత్త నాటోఉక్రెయిన్‌ మండలి సమావేశాన్ని ప్రారంభించారు. తమ కూటమిలోకి ఉక్రెయిన్‌ను చేర్చుకునేందుకు టైమ్‌టేబుల్‌ను ఖరారు చేయడంలో విఫలమయ్యారు. దీనిపై జెలెన్‌స్కీ ఒకింత అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. తమ కూటమికి ఉక్రెయిన్‌కు సాన్నిహిత్యం ఎలా అనే విషయంలో నాటో సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తూర్పు ఐరోపా సభ్యులు ఈ విషయంలో నిబద్ధతను కోరగా అమెరికా, జర్మనీ మాత్రం స్పష్టతివ్వడానికి విముఖంగా ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అధికారిక ప్రకటనలో చైనా గురించి 15సార్లు ప్రస్తావన ఉంది. తమ కూటమికి చైనా వ్యూహాత్మక సవాళ్లు విసురుతోందని నాటో ఆరోపించింది. ఈ ఆరోపణలను చైనా బుధవారం తోసిపుచ్చింది. వాస్తవాలకు భిన్నంగా నాటో వర్ణన ఉన్నదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెంబిన్‌ వెల్లడిరచారు. నిరాధార ఆరోపణలు చేయడాన్ని నాటో మానుకోవాలని తేల్చిచెప్పారు. రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తూ చైనాను లక్ష్యంగా చేసుకునే మనస్తత్వాన్ని విడనాడాలని, ప్రచ్ఛన్న యుద్ధం తరహా ఆలోచన విధానం కాలం చెల్లిందని హితవు పలికారు. యూరప్‌ విషయంలో నాటో చేసిందేమిటో చూశామని, ఆసియాపసిఫిక్‌ లేక ప్రపంచంలోని ఇతర భాగాల్లో గందరగోళం సృష్టించేందుకు నాటో ప్రయత్నించరాదని వాంగ్‌ సూచించారు. నాటో సదస్సుకు వ్యతిరేకంగా ఐరోపా దేశాల్లో అనేక చోట్ల పెద్దఎత్తున నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి. బ్రిటన్‌, ఫ్రాన్స్‌లోనూ ఆందోళనలు జరిగాయి.
బైడెన్‌తో జెలెన్‌స్కీ భేటీ
నాటో సదస్సులో భాగంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భేటీ అయ్యారు. తమ దేశానికి అందించిన సహాయ, సహకారాలు ముఖ్యంగా సైనిక తోడ్పాటుకుగాను బైడెన్‌కు జెలెన్‌స్కీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తాజా పరిణామాలు, ఉక్రెయిన్‌ ఆపరేషన్లు, వ్యూహాత్మక ప్రణాళికలను బైడెన్‌కు వివరించారు. ఉక్రెయిన్‌కు అమెరికా ఇప్పటివరకు 43 బిలియన్‌ డాలర్ల సాయం అందించినట్లు జెలెన్‌స్కీ వెల్లడిరచారు. బైడెన్‌ స్పందిస్తూ ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. అవసరమైనప్పుడల్లా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అనంతరం జెలెన్‌స్కీ సామాజిక మాధ్యమం ద్వారా ఈ భేటీ గురించి తెలిపారు. ఉక్రెయిన్‌కు దీర్ఘకాల మద్దతు, ఆయుధాలు, రాజకీయాలు, నాటోకు సంబంధించిన అంశాలపై బైడెన్‌తో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img