Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

70 ఏళ్ల తర్వాత బ్రిటన్‌ రాజుగా చార్లెస్‌-3 పట్టాభిషేకం

లండన్‌: యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (బ్రిటన్‌)లో కింగ్‌ చార్లెస్‌3 శకం లాంఛనంగా మొదలైంది. 70ఏళ్ల తర్వాత బ్రిటన్‌లో రాజు పట్టాభిషేకం మహోత్సవం ఘనంగా జరిగింది. చార్లెస్‌3 పట్టాభిషేకాన్ని సంప్రదాయ పద్ధతులు, వస్త్రధారణతో శనివారం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబేలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాణి ఎలిజబెత్‌2 వారసుడిగా ఆయన సింహాసనాన్ని అధీష్టించారు. బ్రిటన్‌తో పాటు 14 కమాన్‌వెల్త్‌ దేశాలకు రాజయ్యారు. చార్లెస్‌3 సతీమణి కెమిల్లా కూడా రాణిగా కిరీటాన్ని ధరించారు. రాజు చార్లెస్‌3 ప్రమాణ పత్రంపై సంతకం చేశారు. చట్టాన్ని కాపాడతానని, దయతో వ్యవహరిస్తానని, న్యాయంగా పరిపాలన సాగిస్తానని చార్లెస్‌ ప్రమాణం చేశారు. అన్ని మతాలావారికి స్వేచ్ఛా వాతావరణం కల్పిస్తానన్నారు. ఇంగ్లండ్‌ చర్చికి నమ్మకస్థుడైన క్రైస్తవుడిగా ఉంటానని కూడా ఆయన ప్రమాణం చేశారు. అనంతరం సభికులంతా ‘రాజును దేవుడు రక్షించాలి’ (గాడ్‌ సేవ్‌ కింగ్‌) అని నినదించారు. ప్రమాణం, ప్రార్థనల తర్వాత 1300 సంవత్సరంలో కింగ్‌ ఎడ్వర్డ్‌ చేయించిన సింహాసనాన్ని కింగ్‌ ఛార్లెస్‌-3 అధిష్ఠించారు. ఈ సింహాసనం కింది అరలో స్కాట్లాండ్‌ నుంచి తెచ్చిన పవిత్ర రాయిని ఉంచారు. అనంతరం కింగ్‌ చార్లెస్‌ను జెరూసలెం నుంచి తెచ్చిన పవిత్ర నూనెతో అభిషేకించారు. చేతులు, ఛాతీ, తలపై నూనెను పోశారు. ఇదంతా తెరచాటున జరిగింది. నూనెతో అభిషేకం పూర్తయిన తర్వాత చ్లాంస్‌ బంగారుతాపడంతో చేసిన మహారాజ గౌన్‌ ధరించి సింహాసనంపై కూర్చున్నారు. ఆ తర్వాత శిలువతో ఉన్న గోళాకారంలో ఉండే బంగారు రాజముద్ర, రాజదండాన్ని ఆర్చ్‌బిషప్‌ ఆయనకు అందించారు. కుడిచేతి నాలుగో వేలుకు ఉంగరం తొడిగి కిరీటధారణ చేశారు. అనంతరం చార్లెస్‌ లేచి రాజ ఖడ్గాన్ని చేతిలో పట్టుకుని ప్రత్యేకంగా చేయించిన సింహాసనంపై ఆశీనులయ్యారు. సింహాసనంపై రాజు కూర్చోగానే ఆర్చ్‌బిషప్‌తో పాటు ప్రిన్స్‌ విలియం మోకరిల్లి చార్లెస్‌ కాళ్లకు చేతిని ఆనించి ఆయన కుడి చేతిని ముద్దాడారు. అనంతరం రాణి కెమిల్లాపై పవిత్ర నూనె చల్లి నిరాడంబరంగా కిరీటధారణ చేశారు. రాజకుటుంబానికి దూరమైన చార్లెస్‌ చిన్న కుమారుడు ప్రిన్స్‌ హ్యారీ పట్టాభిషేకానికి హాజరయ్యారు. తన సోదరులతో కలిసి నడిచిన ఆయన నవ్వుతూ కనిపించారు. హ్యారీ ఒంటరిగానే వచ్చారు. ఆయన భార్య మేఘన్‌ మార్కెల్‌, ఇద్దరు పిల్లలు అమెరికాలోనే ఉన్నారు. అయితే పట్టాభిషేకం పూర్తి అయిన తర్వాత రాజు, రాణిగా చార్లెస్‌, కెమిల్లాను బంగారు బగ్గీలో లండన్‌ వీధుల్లో ఊరేగించారు. ఏడువేల దళాలు, 19 మిలటరీ బాండ్లు పాల్గొన్నాయి. రాణి ఎలిజబెత్‌2 పట్టాభిషేకం 1953లో జరిగింది. పట్టాభిషేకం మహోత్సవంలో మతసామరస్యం కనిపించింది. క్రైస్తవయేతర మతపెద్దలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలా గతంలో ఎన్నడూ జరగలేదు. అలాగే హిందువైనప్పటికీ ప్రధాని హోదాలో ఉన్నందున భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బైబిల్‌ను పఠించారు. పట్టాభిషేకాన్ని చరిత్ర, సంస్కృతి, సంప్రదాలను వ్యక్తపర్చే భావనగా ఆయన వర్ణించారు. ఏడు దశాబ్దాల తర్వాత పట్టాభిషేకం జరగడంతో బ్రిటన్‌ ప్రజల్లో ఆనందం ఉరకలెత్తింది. అయితే ప్రపంచ నేతలు, అరిస్టోక్రాట్లు, సెలబ్రెటీలతో సహా రెండు వేల మందికిపైగా అతిథులు హాజరయ్యారు. అమెరికా తొలి మహిళ జిల్‌ బైడెన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌, కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రుడేతో సహా 100 మంది దేశాధినేతలు సతీసమేతంగా హాజరయ్యారు. బ్రిటన్‌ ప్రస్తుత, మాజీ ప్రధానులు పాల్గొన్నారు. 2,300 మంది అతిథుల రాకతో వాతావరణం కోలాహలంగా మారింది. రంగురంగుల పుష్పాలు, టోపీలతో ఆహ్లాదకర వాతావరణం కనిపించింది. వెస్ట్‌మిసిస్టర్‌ అబే వద్దకు లక్షల మంది చేరుకొని రాజు, రాణికి అభివాదం చేశారు. ‘గాడ్‌ సేవ్‌ ది కింగ్‌’ నినాదాలు మార్మ్రోగాయి. సంప్రదాయ పద్ధతిలో సైనికులు నేలపై, సముద్రంపై తుపాకులు పేల్చారు. బ్రిటన్‌లోని అన్ని చర్జీల్లో గంటలు మోగించి సంబరాలు జరుపుకున్నారు. మహిళా బిషప్‌లు తొలిసారిగా బ్రిటన్‌ రాజు పట్టాభిషేకానికి హాజరయ్యారు. పట్టాభిషేకం వేదికను చార్లెస్‌`3కు ఇష్టమైన జీవవైవిధ్యత, సుస్థిరత థీమ్‌తో అలంకరించారు. ఇదిలావుంటే, రాజపాలనకు వ్యతిరేక సంఘాలు బ్రిటన్‌లో పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాయి. మా రాజు కాదు అంటూ నిరసనకారులు నినదించారు. రాజు ఊరేగింపు మార్గంలో ఆందోళనలు చేపట్టారు. దీంతో అనేక మందిని పోలీసులు నిర్బంధించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img