Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

ప్రపంచ వృద్ధికి కేంద్రం ‘ఆసియాన్‌’

ఇండో-పసిఫిక్‌పై దృక్పథానికి భారత్‌ సంపూర్ణ మద్దతు
గ్లోబల్‌ సౌత్‌ గొంతు పెంచడం అందరికీ ప్రయోజనకారి
18వ తూర్పాసియా శిఖరాగ్ర సదస్సులో మోదీ

జకార్త: ప్రపంచంలో క్లిష్ట పరిస్థితులు, అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ఉగ్రవాదం, భౌగోళిక రాజకీయ సంఘర్షణలు పెద్ద సవాళ్లుగా నిలిచాయని ఇండోనేసియా రాజధాని జకార్తలో జరిగిన ఆసియాన్‌భారత్‌ 18వ తూర్పాసియా శిఖరాగ్ర సదస్సులో వక్తలు అన్నారు. సముద్రంలో సహకారం, ఆహార భద్రతపై రెండు ఉమ్మడి ప్రకటనలను సదస్సు ఆమోదించింది. సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తూ ఆగ్నేయాసియా దేశాల మధ్య సహకారం ఉండాలని, స్వేచ్ఛాయుత ఇండో- పసిఫిక్‌ పురోగతి, ‘గ్లోబల్‌ సౌత్‌’ గొంతుకను పెంచడం అందరి ఉమ్మడి ప్రయోజనాల కోసమేనని ఉద్ఘాటించారు. ప్రపంచ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న 10 దేశాల ఆసియాన్‌ కూటమి... వృద్ధికి కేంద్రమని వర్ణించారు. భుజం, భుజం కలిపి పనిచేసేందుకు భారత్‌ సిద్ధమన్నారు. 21వ శతాబ్దం ఆసియాన్‌ దేశాల శకమని చెప్పారు. ఆసియాన్‌-భారత్‌ సదస్సుకు భారత్‌ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ఆసియాన్‌-భారత్‌ కేంద్రీకృతానికి, ఇండో-పసిఫిక్‌పై ఆసియాన్‌ దృక్పథానికి భారతదేశం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. అంతర్జాతీయ చట్టం అన్ని దేశాలకు సమానంగా వర్తించేలా చేయాలని సూచించారు. ఆసియాలోని ‘తైమూర్‌-లెస్టే’లో భారత రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని మోదీ ప్రకటించారు. అన్ని దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను బలోపేతం చేయడానికి ఉమ్మడి కార్యాచరణ అవసరమని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, ఉగ్రనిధి, సైబర్‌ తప్పుడు సమాచారం తదితర అంశాలపై ఉమ్మడి పోరుకు పిలుపుతో పాటు 12 అంశాల ప్రతిపాదనను గ్లోబల్‌ సౌత్‌ కోసం మోదీ చేశారు. గతేడాది సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకునేందుకు నిర్ణయించిన తర్వాత రెండు వర్గాల మధ్య ఇదే తొలి సదస్సు కాగా అంతర్జాతీయ సవాళ్లు, పర్యావరణ సమస్యల పరిష్కారానికి పరస్పరం సహకరించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. 12 అంశాల ప్రతిపాదనలో డిజిటల్‌ భవిష్యత్‌ కోసం ఆసిjన్‌భారత్‌ నిధి ఏర్పాటుకూ ప్రతిపాదన ఉంది. ఆసియాన్‌, తూర్పాసియా (ఎరియా) ఆర్థిక, పరిశోధన ఇన్‌స్టిట్యూట్‌కు మద్దతు పునరుద్ధరణనూ ప్రకటించారు. భారత్‌లో డబ్లూహెచ్‌ఓ ద్వారా సంప్రదాయ ఔషధాల తయారీ, జనౌషధీ కేంద్రాల ద్వారా ప్రజలకు అందుబాటు ధరలకు నాణ్యమైన మందులు అందించగలిగిన భారత్‌ అనుభవాన్ని మోదీ పంచుకున్నారు. విపత్తులను తట్టుకొనే స్వీయసమృద్ధి సంస్థాగత కూటమిలో చేరాలని ఆసియాన్‌ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. భారత్‌ అధ్యక్షతన జీ20 సదస్సు జరగబోతున్న నేపథ్యంలో ఒక భూమి, ఒక కుటుంబం, ఒకే భవిష్యత్‌’ నినాదంతో వసుధైవ కుటుంబకం గురించీ మోదీ ప్రస్తావించారు. కాగా, ఆసియాన్‌ దేశాల్లో ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థాయిలాండ్‌, బ్రూనే, లావోస్‌, మైన్మార్‌, కంబోడియా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img