Friday, December 1, 2023
Friday, December 1, 2023

గాజాలో బాలల మృతి

రోజుకు 420 మంది పలస్తీనా చిన్నారుల మృతి: యూనిసెఫ్‌
మానవాళి రక్షణకు హామీనివ్వాలి: ఐరాసకు రాయబారుల వినతి

జెనీవా: గాజాపై ఇజ్రాయిల్‌ దురాక్రమణ మానవతా విపత్తునకు తెరతీసింది. ఇజ్రాయిల్‌ వైమానిక, భూతల దాడుల్లో నిత్యం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోజుకు కనీసం 420 మంది పిల్లలు చనిపోతున్నారు. దీంతో గాజా పిల్లల శ్మశానంగా మారిందని యూనిసెఫ్‌ ఆవేదన వ్యక్తం చేసింది. పలస్తీనా ప్రజలను ఇజ్రాయిల్‌ సామూహికంగా శిక్షిస్తోందని యూఎన్‌ రిలీఫ్‌, వర్క్స్‌ ఏజెన్సీ (యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ) కమిషనర్‌ జనరల్‌ ఫిలిప్‌ లజ్జారిని అన్నారు. అనుషంగిక నష్టం నుంచి పిల్లలు, మహిళల రక్షణకు హామీనివ్వాలని ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ప్రపంచ దేశాలను ఫిలిప్‌ కోరారు. గాజాలో కాల్పుల విరమణ కోసం ఒత్తిడి తేవాలని యూఏఈ, చైనాకు పిలుపునిచ్చారు. యూనిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ క్యాథరీన్‌ రస్సెల్‌ మాట్లాడుతూ 26 రోజులుగా జరుగుతున్న దాడుల్లో సుమారు 4వేల మంది పిల్లలు చనిపోగా పలస్తీనాలో మృతుల సంఖ్య 8,500కు చేరుకున్నది. 20వేల మందికి గాయాలయ్యాయి. ఈ లెక్కల రోజుకు 420 మందికిపైగా చిన్నారులు చనిపోతున్నారు. వందల మంది గాయపడుతున్నారు. ఇజ్రాయిల్‌ దాడుల్లో గాజాలోని బాల్యం ఛిద్రమవుతోందని క్యాథరీన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల్లో 70 శాతానికిపైగా పిల్లలు, మహిళలు ఉన్నట్లు ఫిలిప్‌ లజ్జారిని వెల్లడిరచారు. కనివిని ఎరుగని రీతిలో మానవతా విపత్తు మన కళ్ల ఎదుట సంభవిస్తోందని, ఇది భరించలేనిదని అన్నారు. తమ ఇళ్లు, వాకిళ్లు విడిచి వెళ్లిపోయేలా లక్షల మంది పలస్తీనా ప్రజలను ఇజ్రాయిల్‌ బలవంతపెడుతోందని, పర్యవసానంగా యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ శిబిరాలు కిక్కిరిసిపోయాయని అన్నారు. 6,70,000 మంది పలస్తీనా ప్రజలు నిరాశ్రులయ్యారని, శిబిరాలుగా మార్చబడిన స్కూళ్లలో తలదాచుకుంటున్నారని చెప్పారు. యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏకు చెందిన 65 మంది సిబ్బంది అక్టోబరు 7 నుంచి గాజా స్ట్రిప్‌లో జరిగిన ఇజ్రాయిల్‌ దాడుల్లో చనిపోయారని తెలిపారు. వెస్ట్‌ బ్యాంక్‌, తూర్పు జెరూసలేంలో పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తున్నట్లు ఫిలిప్‌ చెప్పారు. 34 ఆరోగ్య కేంద్రాలు, 21 ఆసుపత్రులపై ఇజ్రాయిల్‌ దాడులు జరిపిందని, 12 ఆసుపత్రులు దెబ్బతిన్నాయని క్యాథరీన్‌ రస్సెల్‌ తెలిపారు. ఇజ్రాయిల్‌ బాంబులకు 221 స్కూళ్లు, 1,77,000 ఇళ్లు ధ్వంసమైనట్లు వెల్లడిరచారు. తక్షణమే కాల్పులు, దాడులను విరమించాలని, పిల్లల భద్రతకు హామీనివ్వాలని పిలుపునిచ్చారు.120 దేశాలు ఆమోదించిన ఐరాస సర్వసభ్య సమావేశ తీర్మానం గాజాలో దాడులు ఆపేయాలని డిమాండ్‌ చేస్తోందని ఐరాసకు చైనా రాయబారి జాంగ్‌ జున్‌ గుర్తుచేశారు. మొత్తం ప్రపంచం ఖండిస్తున్నాగానీ ఇజ్రాయిల్‌ తీరు మారడంలేదని రష్యా దౌత్యాధికారి వసీలీ నెబెన్‌జ్యా విమర్శించారు. అమెరికా మద్దతిస్తున్నందునే ఇజ్రాయిల్‌ విషయంలో భద్రతా మండలి కఠిన చర్యలు తీసుకోలేకపోతోందన్నారు. పలస్తీనా దౌత్యాధికారి మాట్లాడుతూ మానవాళిని రక్షించాలంటే గాజాలోని పలస్తీనియా ప్రజలను కాపాడాలని పిలుపునిచ్చారు. కాగా, నిషేధిత శ్వేత ఫాస్పరస్‌ ఆయుధాలతో రసాయన దాడులకు ఇజ్రాయిల్‌ పాల్పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img