Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

కుప్పకూలిన డచ్‌ ప్రభుత్వం

వలసవాద విధానంపై కుదరని రాజీ
అధికార కూటమిలో చీలిక
ప్రధాని రుట్టే, కేబినెట్‌ రాజీనామా
నవంబరులో నెథర్లాండ్స్‌ ఎన్నికలు

ఆమ్‌స్టర్‌డామ్‌: డచ్‌ ప్రభుత్వం కుప్పకూలింది. నాలుగు పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వంలో వలసలకు సంబంధించి తీవ్రస్థాయిలో అభిప్రాయ బేధాలు తలెత్తాయి. వలసలుశరణార్థులకు పరిధి నిర్ణయించే దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమైన కారణంగా అధికార కూటమి చీలిపోయింది. దీంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు డచ్‌ ప్రధాని మార్క్‌ రుట్టే వెల్లడిరచారు. సుదీర్ఘకాలం దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన రుట్టే తన ప్రభుత్వం తరపున రాజీనామా లేఖను రాజు అలెగ్జాండర్‌కు అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు. తాజా పరిణామాల క్రమంలో ఏడాది చివరిలో దేశానికి ఎన్నికలు అనివార్యమయ్యాయి. రుట్టే ది హేగ్‌లో విలేకరులతో మాట్లాడుతూ ‘వలసవాద విధానానికి సంబంధించి సంకీర్ణ భాగస్వామ్యులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నది చెప్పడంలో రహస్యమేమీ లేదు. ఇందుకు పరిష్కారం లభించడం సాధ్యంకాదని తేలిపోయింది. ఏకాభిప్రాయం కుదరని పక్షంలో రాజీనామా నిర్ణయం తీసుకున్నాం. మొత్తం కేబినెట్‌ తరపున రాజీనామా పత్రాన్ని రాజు అలగ్జాండర్‌కు అందజేశా’ అని చెప్పారు. వలసవాద విధానంపై ఒప్పందం చేసుకునేందుకుగాను బుధ, గురువారాలలో అర్థరాత్రి వరకు రుట్టే జరిపిన చర్చలు ఫలించలేదు. శుక్రవారం సాయంత్రం తుది దశ చర్చల్లోనూ రాజీ కుదరలేదు. ఏకాభిప్రాయం అసాధ్యమన్న నిర్ణయానికి పార్టీలు వచ్చాయి. కలిసి ముందుకెళ్లమని విడిపోవాలని నిర్ణయించాయి. దీంతో ప్రతిపక్షాలు ఏ మాత్రం ఆలశ్యం చేయకుండా ఎన్నికలకు పిలుపునిచ్చాయి. రాజీనామాను రుట్టే అధికారికంగా ధ్రువీకరించేంత వరకు కూడా ఆగలేదు. ‘ఇక ఎన్నికలే తరువాయి’ అని యాంటీ ఇమిగ్రేషన్‌ పార్టీ ఫర్‌ ఫ్రీడమ్‌ నేత గ్రెట్‌ విల్డర్స్‌ ట్వీట్‌ చేశారు. ఈ దేశానికి మార్పు అవసరమని గ్రీన్‌ లెఫ్ట్‌ నాయకుడు జెస్సే క్లావెర్‌ వెల్లడిరచారు. తాజా పరిణామాలతో నెథార్లాండ్స్‌ పార్లమెంటరీ ఎన్నికలు నవంబరులో జరుగుతాయని డచ్‌ ఎన్నికల మండలి ప్రకటించింది. ఈమేరకు నెథర్లాండ్స్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఓఎస్‌) తెలిపింది. తన కుటుంబంతో పాటు గడిపేందుకు గ్రీస్‌ వెళ్లిన డచ్‌ రాజు విల్లమ్‌ అలగ్జాండర్‌ తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని తిరిగొచ్చారు. శనివారం హేగ్‌లోని హుయ్యస్‌ టెన్‌ బాష్‌ రాయల్‌ ప్యాలెస్‌లో మార్క్‌ రుట్టేతో భేటీ అయ్యారు. కాగా, రుట్టే ప్రభుత్వం 18 నెలల కిందట అధికారంలోకి వచ్చింది. తమ దేశంలో శరణ కోరేవారి సంఖ్యను కట్టడి చేసేందుకు అన్ని విధాలా యత్నించింది. శరణాలయాలను రెండు విభాగాలుగా విభజించాలని, తాత్కాలిక శిబిరంలో ఘర్షణల వల్ల శరణం కోరే వారిని ఉంచాలని, శాశ్వత శిబిరంలో మిగతా శరణార్థులను ఉంచేలా ప్రతిపాదనలు వచ్చాయి. నెథర్లాండ్స్‌లో శరణ కోరే కుటుంబ సభ్యుల సంఖ్య తగ్గించాలన్న ఆలోచనను కూడా రుట్టే ప్రభుత్వం చేసింది. కానీ ఏది అనుకూలంగా పరిణమించలేదు. గతేడాది శరణాలయాలు కిటకిటలాడగా కొన్ని వందల మంది ఆరు బయట నిద్రించే పరిస్థితి ఏర్పడిరది. 2022లో యూరప్‌ బయట నుంచి వచ్చి 21,500 మందికి నెథర్లాండ్స్‌ ఆశ్రయమిచ్చింది. పని విద్యాభ్యాసం కోసం లక్షలాది మంది నెథర్లాండ్స్‌కు వస్తుంటారు. దీనికి శరణార్థులు తోడు కావడం ఆ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. జనాభా పెరగడంతో వసతి కల్పన సమస్యగా తయారైంది. కొత్తగా వచ్చిన శరణార్థులకు వసతిని మున్సిపాలిటీలే కల్పించేలా చట్టాన్ని రుట్టే ప్రభుత్వం తెచ్చింది కానీ దానిని పార్లమెంటు ఉభయ సభల ఆమోదించాల్సివుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img