ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ దుర్ఘటనలో సుమారు 43 మంది మృతి చెందగా… డజన్ల సంఖ్యలో జనం గాయాల పాలయ్యారు. ఏడు అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం వల్ల 43 మంది చనిపోయినట్లు బంగ్లాదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి సమంత లాల్ సేన్ తెలిపారు. గాయపడ్డవారు ప్రస్తుతం ఢాకా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. బర్న్ హాస్పిటల్‌లో దాదాపు 40 మందికి చికిత్స అందిస్తున్నారు. ఢాకాలోని బెయిలీ రోడ్డులో ఉన్న పాపులర్ బిర్యానీ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగసినట్లు అగ్నిమాపక శాఖ అధికారి మహమ్మద్ షిహబ్ తెలిపారు. చాలా వేగంగా మంటలు భవనంలోని పై అంతస్తులకు వ్యాపించడంతో వాటిలో ఉన్నవారు అగ్ని కీలల్లో చిక్కుకున్నారు. ప్రమాదం జరిగిన రెండు గంటల్లోనే అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పింది. సుమారు 75 మందిని రక్షించారు. ఢాకాలోని బెయిలీ రోడ్డులో ఎక్కువ శాతం రస్టారెంట్లు, క్లాతింగ్, మొబైల్ ఫోన్ షాపులు ఉన్నాయి. కచ్చి భాయ్ అనే రెస్టారెంట్‌లో ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో మంటలు అంటుకున్నాయి. అయితే పై అంతస్తుల్లో ఉన్న వారు కిందికి దూకడం, ఊపిరి ఆడకపోవడం వల్ల మరణించారు.