Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

ఆధునిక బానిసత్వాన్ని అంగీకరించం

. గ్రీస్‌లో కదం తొక్కిన కార్మికలోకం
. కార్మిక వ్యతిరేక బిల్లుకు నిరసనగా జాతీయ సమ్మె కేకేఈ మద్దతు

ఏథెన్స్‌: గ్రీస్‌లో కార్మికలోకం కదంతొక్కింది. కన్జర్వేటివ్‌ న్యూ డెమొక్రసీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక బిల్లును తిరస్కరించింది. తక్షణ ఉపసంహరణకు డిమాండ్‌ చేసింది. ఆధునిక బానిసత్వాన్ని తేవాలని ప్రభుత్వం చూస్తోందని దుయ్యబట్టింది. దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. ఓ వైపు వరదలు, కార్చిచ్చులతో ప్రజలు అల్లాడిపోతుంటే బానిసత్వం ముగ్గులోకి కార్మికులను దింపేందుకు కన్జర్వేటివ్‌ ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోందని కార్మిక నేతలు ఉద్ఘాటించారు. బానిసత్వ సంకెళ్లు వేస్తామంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పబోవని హెచ్చరించారు. బిల్లుకు నిరసనగా సమ్మెబాట పట్టారు. దేశవ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వేలాది మంది రోడ్లపైకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. బిల్లు ఉపసంహరణకు డిమాండ్‌ చేశారు. ఆల్‌ వర్కర్స్‌ మిలిటెంట్‌ ఫ్రంట్‌ (పీఏఎంఈ)తో పాటు వేర్వేరు రంగాల కార్మిక సంఘాల అధ్వర్యంలో రాజధాని ఏథెన్స్‌లోని సింటాగ్మా స్క్వేర్‌ వద్ద ధర్నా జరిగింది. థెస్సాలోనికి, లారిస్సా, పట్రాస్‌, లోన్నినా, కోర్ఫూ, కటేరిని వంటి ప్రముఖ నగరాల్లో భారీ ప్రదర్శనలు, నిరసనలు జరిగాయి. కార్మికులకు గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) సంఫీుభావం తెలిపింది. గ్రీస్‌ కమూనిస్ట్‌ యూత్‌ (కేఎన్‌ఈ) కూడా మద్దతు ప్రకటించాయి. సమ్మెలో పాల్గొన్న కేకేఈ ప్రధాన కార్యదర్శి దిమిట్రిస్‌ కౌట్‌సోంపస్‌ మాట్లాడుతూ ‘కార్మికట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమం దేశాన్ని కుదిపివేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన పెద్దఎత్తున జరుగుతోంది. గ్రీక్‌ కార్మికుల సమాఖ్య (జీఎస్‌ఈఈ) నాయకత్వం రాజీ పడిరది కాబట్టే కార్మిక వ్యతిరేక బిల్లు పార్లమెంటును చేరుకోగలిగింది. ఈ బిల్లుపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది’ అని వ్యాఖ్యానించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా సమ్మెకు, ఆందోళనలకు పిలుపు ఇవ్వనందుకుగాను గ్రీక్‌ కార్మికుల సమాఖ్య (జీఎస్‌ఈఈ)పై కార్మిక సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు ప్రకారం కార్మికులు వారంలో ఆరు రోజులు పనిచేయాల్సి ఉంటుంది. రోజుకు ఎనిమిది గంటలకు బదులు 13 గంటలు పనిచేయాలి. ఉద్యోగంలో చేరిన ఏడాదిలోపు ఎలాంటి కారణం చూపకుండా, వేతనం ఇవ్వకుండా ఉద్యోగిని తొలగించవచ్చు. ఉద్యోగులు సమ్మెలు చేస్తే వారికి జరిమానాలు విధించవచ్చు. అలాగే ఆరునెలలు జైలుకు పంపేందుకు వీలు ఉంటుంది. ఇటువంటి బిల్లును తక్షణమే రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img