టర్కీ కమ్యూనిస్టు పార్టీ పిలుపు
అంకారా : ఒకదాని తర్వాత ఒకటిగా దేశాలకు సభ్యత్వమిస్తూ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న నాటోకు అడ్డుకట్ట వేయడం ఎంతైనా అవసరమని టర్కీ కమ్యూనిస్టు పార్టీ (టీకేపీ) ఉద్ఘాటించింది. తాజాగా స్వీడెన్‌కు సభ్యత్వం కల్పించడం, అందుకు టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్ పచ్చజెండా ఊపడాన్ని ప్రస్తావించింది. నాటో… ప్రపచంలోనే అతిపెద్ద ఉగ్రసంస్థ అని, దీనిని అడ్డుకోవడం అత్యవసరమని, ఇందుకోసం జరిపే పోరాటంలో మరింత జాప్యం తగదని పిలుపునిచ్చింది. దీనిని వదిలేస్తే మరో దేశం కూడా నాటోలో చేరేందుకు ఎంతో సమయం పట్టబోదని తాజా ప్రకటనలో టీకేపీ ఆందోళన వ్యక్తంచేసింది. ‘ఇతర దేశాల ప్రజల అణచివేతలో మన ప్రభుత్వ పాత్రకు వ్యతిరేకంగా పోరాటడం కూడా మన కర్తవ్యం’ అని నొక్కిచెప్పింది. ‘నాటో విస్తరణతో దానికి బలం పెరుగుతోంది. ముందుగా సభ్యదేశాల వర్కర్లపై దాడులు జరుగుతాయి. ఈ సంస్థ విస్తరణకు అర్థం ప్రపంచానికి యుద్ధం ముప్పును పెంచడమే’ అని టర్కీ కమ్యూనిస్టు పార్టీ ప్రకటన పేర్కొంది. టర్కీ చరిత్రలోనే విప్తవ వ్యతిరేక పార్లమెంటు ఇదేనని ఎర్దోగన్ పాలనను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ‘నాటో విస్తరణను అడ్డుకోవాలి. సామ్రాజ్యవాద, నాటోయిజం వ్యతిరేక పోరాటాలను బలోపేతం చేయాలి. ప్రతిఘటనా బలాన్ని పెంచుకోవాలి. ఇందుకు ఆలశ్యం చేయడం సరి కాబోదు. మన దేశం నుంచి నాటోను పూర్తిగా పారద్రోలాలి. అన్ని స్థావరాలు, మొత్తం సైన్యాన్ని తరలిస్తే తప్ప స్వతంత్ర లౌకిక దేశం ఏర్పాటు కాదు’ అని టర్కీ కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సూచించింది.