నాటోకు చైనా హెచ్చరిక
బీజింగ్: తూర్పు ఆసియా దేశాల జోలికి వెళ్లవద్దని, ఆ ప్రాంతంలో అడుగు పెట్టే ధైర్యం చేయొద్దని నాటోకు చైనా స్పష్టం చేసింది. తూర్పు ఆసియాలో శాంతి స్థాపనలో ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (ఏషియన్) కీలక పాత్రను తక్కువ చేసే విధంగా జరుగుతున్న ప్రయత్నాలను విమర్శించింది. ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించేందుకు ఏషియన్ చేస్తున్న కృషిని తీసిపారేడం తగదని హితవు పలికింది. జకార్తలో జరిగిన తూర్పు ఆసియా వార్షిక సదస్సు సందర్భంగా చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ, విదేశీ వ్యవహారాల కమిషన్ కార్యాలయ డైరెక్టర్ వాంగ్ యీ మాట్లాడుతూ చిన్న దేశాల భద్రతకు, సహకారానికి, అంతర్జాతీయ భద్రతా చర్యలకు చైనా సానుకూలంగా ఉందని చెప్పారు. సౌతీస్ట్ ఏషియా న్యూక్లియర్ వెపన్`ఫ్రీజోన్‌పై ఒప్పందం మీద సంతకాల కోసం నేతృత్వం వహించేందుకు సిద్ధమన్నారు. ప్రస్తుతానికి ప్రాంతీయ శాంతి, సుస్థితర, అభివృద్ధి, సమర్థ సహకార విస్తరణ కోసం అందరితో కలిసి పనిచేయాలని ఏషియన్ దేశాలు కోరుకుంటున్నాయి. కాగా, ఇండోనేసియా రాజధానిలో జరిగిన ఈ సదస్సులో 10 ఆసియా దేశాలతో పాటు ఆస్ట్రేలియా, చైనా, జపాన్, భారత్, న్యూజిలాండ్, కొరియా, రష్యా, అమెరికా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.