వాషింగ్టన్: అంతరిక్షంలో దాదాపు ఆరునెలలపాటు గడిపిన నలుగురు వ్యోమగాములు… క్షేమంగా భూమిపైకి తిరిగొచ్చారు. సోమవారం తెల్లవారుజామున వీరు స్ప్లాష్ డౌన్ విధానంలో ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగారు. ఇందుకోసం స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూడ్రాగన్ క్యాప్సుల్‌ను ఉపయోగించారు. నాసా-స్పేస్ ఎక్స్ సంయుక్తంగా నిర్వహించిన క్రూ-6 మిషన్‌లో ఈ వ్యోమగాములు పనిచేశారు. వీరు అంతరిక్ష కేంద్రం నుంచి 13 అడుగుల వెడల్పైన క్రూడ్రాగన్ వాహనంలోకి ఆదివారం ప్రవేశించారు. దాదాపు ఒక రోజు భూకక్ష్యలో తిరిగి ఫ్లొరిడాలోని జాక్సన్‌విల్లే సముద్ర తీరం వద్ద ల్యాండ్ సైట్ సమీపంలోకి చేరుకున్నారు. అర్ధరాత్రి తర్వాత వారి క్యాప్సుల్ సముద్రజలాలపై దిగింది. ఈ ప్రయాణంలో క్రూడ్రాగన్ క్యాప్సుల్ ఒక దశలో గంటకు 27,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత సుమారు 1900 డిగ్రీల వద్దకు దీని బాహ్య ఉష్ణోగ్రత చేరుకొంది. అనంతరం దీనికి అమర్చిన ప్యారాచూట్లు విచ్చుకోవడంతో వేగం నెమ్మదించి మెల్లగా సముద్రంలో పడిరది. దీనిని డ్రాగన్స్ నెస్ట్ అనే ప్రత్యేక బోట్‌లోకి ఎక్కించారు. అక్కడే వ్యోమగాములకు అన్ని పరీక్షలు నిర్వహించారు. తాజాగా నేలపైకి చేరిన వ్యోమగాముల్లో ఇద్దరు అమెరికాకు చెందినవారు కాగా… మిగతా ఇద్దరు రష్యా, యూఏఈకి చెందినవారు. ఈ వ్యోమగాముల బృందం ఈ ఏడాది మార్చి నుంచి ఆరు నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు నిర్వహించింది. అనంతరం క్రూ-3 బృందం ఆగస్టు 27న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. దీంతో అక్కడి పరిశోధనలను వారికి అప్పగించి వీరు తిరుగుముఖం పట్టారు. వీరు తమ ఆరు నెలల కాలంలో దాదాపు 200కు పైగా సైన్స్ అండ్ టెక్ ప్రాజెక్టులను చేపట్టారు.