కిమ్ ఆదేశం
ప్యాంగ్యాంగ్ : యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ సైనిక బలగాలను ఆదేశించారు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోం గ్ ఉన్. ఉత్తర కొరియా ప్రధాన ఆయుధ కర్మాగారాలను సందర్శించిన కిమ్… సైనిక బలగాల సంసిద్ధతను పర్యవేక్షించారు. క్షిపణులు సహా మిగిలిన ఆయుధాల ఉత్పత్తిని భారీగా పెంచాలని ఆదేశించారు. వచ్చే వారంలో సైనిక విన్యాసాలను ప్రారంభిస్తామని.. దక్షిణ కొరియా- అమెరికా ప్రకటించిన క్రమంలో కిమ్ ఆకస్మికంగా ఆయుధ స్థావరాలను సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వ్యూహాత్మక క్షిపణులు, మొబైల్ లాంచ్ ప్లాట్‌ఫామ్‌లు, సాయుధ వాహనాలు, ఫిరంగి షెల్స్‌ను ఉత్పత్తి చేసే కర్మాగారాలను కిమ్ సందర్శించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) తెలిపింది. కిమ్‌తో పాటు ఉన్నతాధికారుల బృందం కూడా ఉన్నట్లు పేర్కొంది. క్షిపణి కర్మాగారంలో ఆయుధ కార్యక్రమాలను మరింత పెంచేలా స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులను కిమ్ ఆదేశించారు. ఫ్రంట్ లైన్ మిలిటరీ యూనిట్ల అవసరాలకు అనుగుణంగా క్షిపణులను భారీగా ఉత్పత్తి చేయాలని కూడా ఉత్తరత్త కొరియా అధినేత స్పష్టం చేశారు. మరోవైపు ఉత్తర కొరియాలో తుపాను ధాటికి అతలాకుతలమైన ప్రాంతాలను కూడా కిమ్ పరిశీలించారు. వరదల హెచ్చరికలు ఉన్నప్పటికీ సరైన విధంగా సిద్ధం కాని అధికారులపై కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కిమ్.. అందుతున్న సహాయ చర్యలను ప్రత్యక్షంగా పర్య వేక్షించి కీలక సూచనలు చేశారు. వరదల వల్ల సుమారు 200 హెక్టార్ల వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యాయని ఉకేసీఎన్‌సీ తెలిపింది. అయితే ఈ వరదలు ఎప్పుడు సంభవించాయి? కిమ్ ఎప్పుడు పర్యటించారు? అనే విషయాలను వెల్లడిరచలేదు. రైతులకు మార్గదర్శకత్వం చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇంతటి నష్టం వాటిల్లిందని కేసీఎన్‌ఏ తెలిపింది.
సైనిక విన్యాసాలను విరమించుకోవాలి
సియోల్: ఈ నెలాఖరులో అమెరికాతో కలిసి సైనిక విన్యాసాలు చేయాలన్న ప్రతిపాదనను దక్షిణకొరియా విరమించుకోవాలని ఆ దేశంలోని శాంతి కార్యకర్తలు డిమాండ్ చేశారు. ‘కొరియా ద్వీపకల్పం ఇప్పుడు మళ్లీ యుద్ధం, శాంతి కూడలిలో ఉంది. దక్షిణ కొరియా-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు నిలిపివేయడం అనేది యుద్ధాన్ని నిరోధింపజేసి మళ్లీ చర్చలకు తలుపులు తెరవడంలో నిర్ణయాత్మక దశ కావచ్చు’ అని సోమవారం ఇక్కడ శాంతి ర్యాలీ నిర్వహించిన ‘కొరియా పీస్’ విజ్ఞప్తి చేసింది. సియోల్‌లోని అధ్యక్ష కార్యాలయం ఎదుట ర్యాలీ సందర్భంగా కార్యకర్తలు శాంతి కోసం నినాదాలు చేశారు. ‘సైనిక సంఘర్షణకు అవకాశం కల్పించే ఈ అత్యంత ప్రమాదకరమైన బల ప్రదర్శన కేవలం విపత్తుతో ముగుస్తుంది’ అని కొరియా పీస్ పేర్కొంది. ఈ శాంతి సంస్థలో దక్షిణ కొరియాలోని వందలాది పౌర, మత సమూహాలు, డజన్ల కొద్దీ విదేశాల్లోని యుద్ధ వ్యతిరేక బృందాలున్నాయి. దక్షిణ కొరియా`అమెరికా ప్రభుత్వాలు సైనిక ఉద్రిక్తతలను తగ్గించాలని, కొరియా ద్వీపకల్పంలో సాయుధ పోరాటాన్ని నిరోధించడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.