పలస్తీనాలో మారణహోమంపై దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు పార్టీ
జొహనెస్‌బర్గ్: గాజాలో మారణహోమానికి ఇజ్రాయిల్, దానికి మద్దతిచ్చే అమెరికానే బాధ్యత వహించాలని దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు పార్టీ (ఎస్‌ఏసీపీ) పేర్కొంది. ఇజ్రాయిల్‌పై నిషేధాజ్ఞతలు మరింతగా విధించాలని పిలుపునిచ్చింది. ఆ దేశానికి ఎగుమతులు, ఆ దేశం నుంచి దిగుమతులు నిలిపివేయాలని, రాయబారులను వెనక్కి పంపాలని డిమాండ్ చేస్తూ ఓ ప్రకటన చేసింది. పలస్తీనా ప్రజలకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించింది.‘అమెరికాతో జతకట్టి మారణహోమం సృష్టిస్తూ 10వేల మంది పలస్తీనీయన్ల ప్రాణాలను ఇజ్రాయిల్ హరించింది. దీనిని తీవ్రంగా ఖండిసున్నాం. ఇజ్రాయిల్ దౌత్యాధికారులను దక్షిణాఫ్రికా రికాల్ చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఫ్రీడమ్ ఫ్రంట్ ప్లస్‌కు ఏం కావాలన్నది కాదు మారణహోమాన్ని దక్షిణాఫ్రికా సహించబోదన్న సందేశం వెళ్లాలి. దక్షిణాఫ్రికాలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయాన్ని మూసివేయాలి. రాయబారితో పాటు సిబ్బందిని వెంటనే పంపించేయాలి. ఇజ్రాయిల్‌కు ఎగుమతులు, దిగుమతులకు కార్మికులు నిరాకరించాలి. నిషేధాన్ని మరింత తీవ్రతరం కావాలి. ఇజ్రాయిల్ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవాలి. ఆంక్షలు కఠినతరం చేయాలి’ అని దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు పార్టీ పేర్కొంది. గాజాకు ప్రతిరాత్రి కాళరాత్రి… అక్కడ జరుగుతున్నది మానవతా సంక్షోభం కంటే ఎంతో తీవ్రమైనదని, గడిచే ప్రతి గంట విలువైనదని, గాజా పిల్లలు మృత్యుఒడికి చేరుతున్నారని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ చెప్పడాన్ని కమ్యూనిస్టు పార్టీ గుర్తుచేసింది. మారణహోమానికి ఇజ్రాయిల్‌కు ఆయుధాలు అందించే అమెరికాదే జవాబుదారీ అని పేర్కొంది.