బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా కొత్త అధ్యక్షుడిగా జేవియర్ మిల్లా ఎన్నికయ్యారు. ఈ నెల 19వ తేదీన అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మిల్లాకు 55.8శాతం ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి సెర్గియో మాసాకు 44.2శాతం ఓట్లు పోలయ్యాయి. లా లిబర్టాడ్ అవాంజా నేత అయిన జేవియర్ మిల్లా… తనను గెలిపిస్తే… అర్జెంటీనాలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకువస్తానని ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు. అర్జెంటీనా ఎన్నికల సమయంలో ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ద్రవ్యోల్బణం 140శాతానికి పెరిగింది. సెర్గియో మాసా ప్రాతినిథ్యం వహిస్తున్న పెరోనిస్ట్ మూవ్‌మెంట్ పార్టీ గత 20 ఏళ్లలో 16 సంవత్సరాల పాటు అర్జెంటీనాను పాలించింది. ఎన్నికల ఫలితాలపై మాసా స్పందిస్తూ ప్రజలు ఈ సారి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన మిల్లాకు అభినందనలు తెలిపారు. త్వరలోనే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో విజయం తర్వాత మిల్లా స్పందిస్తూ… అర్జెంటీనా పునర్నిర్మాణం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. డిసెంబర్ 10న ఆయన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. విక్టోరియా విల్లర్రుయెల్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జేవియర్ రాజకీయాల్లోకి రాక ముందు ప్రొఫెసర్‌గా పని చేశారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో అర్థశాస్త్రం బోధించారు. అలాగే ఆర్థికశాస్త్రం, రాజకీయాలపై అనేక పుస్తకాలను రాశారు.