న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా నెతన్యాహు ఇంటి వద్ద ధర్నా
టెల్‌అవీవ్: ఇజ్రాయిల్‌లో ప్రజాందోళన మిన్నంటింది. నెతన్యాహు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 28 వారాలుగా దేశమంతటా ఆందోళనలు జరుగుతున్నాయి. కొత్త ప్రతిపాదించిన న్యాయ సంస్కరణల అమలులో నెతన్యాహు ప్రభుత్వం దూకుడు పెంచింది. దీంతో రాజధాని టెల్ అవీవ్‌లో భారీ స్థాయిలో ప్రదర్శనలు జరిగాయి. దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది టెల్ అవీవ్‌కు చేరుకొని నిరసనల్లో పాల్గొన్నారు. మరిన్ని ప్రధాన నగరాల్లోనూ నిరసనలు జరిగాయి. టెల్ అవీవ్ ప్రదర్శన క్రమంలో ‘ఎస్‌ఓఎస్’ అనే భారీ బ్యానర్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా గాల్లోకి గులాబీ, కాషాయ రంగులను వెదజల్లి ఆందోళనకారులు నిరసన తెలిపారు. జెరూసలేంలోని నెతన్యాహు ఇంటి వద్ద కాగడాలతో ధర్నా చేశారు. కోస్తా నగరాలైన హెర్జిలియా, నెతన్యాలో భారీ ప్రదర్శనలు జరిగాయి. ప్రధాని నెతన్యాహు (73) డీహైడ్రేషన్‌తో ఆసుపత్రి పాలైన సమయంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరగడం గమనార్హం. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. న్యాయ సంస్కరణల అమలునకు కీలక బిల్లును నెతన్యాహు ప్రభుత్వం తెచ్చింది. దీంతో జడ్జిల నియామకాల్లో ప్రభుత్వానికి ప్రాతినిధ్యం లభిస్తుంది. ఈ బిల్లు చట్ట రూపం దాల్చాలంటే మరో రెండుసార్లు ఓటింగ్ ద్వారా ఆమోదించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ నెలాఖరుకు పూర్తి కావచ్చని తెలిసింది.