Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

ఇంగ్లండ్‌లో వైద్యులు భారీ సమ్మె

. ఐదు రోజులు విధులకు హాజరుకాని వేలాది మంది డాక్టర్లు
. దిగొచ్చిన బ్రిటన్‌ ప్రభుత్వం జీతాలు పెంచుతూ ప్రకటన
. సమ్మెలు విరమించాలని అన్ని రంగాలకు పిలుపు
. ఇదే తుది నిర్ణయంచర్చలకు తావు లేదని స్పష్టీకరణ


లండన్‌: ఆరోగ్య వ్యవస్థ చరిత్రలోనే అతిపెద్ద సమ్మె బ్రిటన్‌లో జరిగింది. వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో ఐదు రోజుల పాటు విధులను వేలాది మంది వైద్యులు బహిష్కరించారు. జూనియన్‌ వైద్యులు ఉదయం 7 గంటల నుంచి సమ్మెలో పాల్గొని 35శాతం వేతనాల్లో పెంపునకు డిమాండ్‌ చేశారు. 2008లో ఉన్నట్లుగానే జూనియన్‌ వైద్యుల జీతాల్లో 35శాతం పెంపుదల కోసం బ్రిటిన్‌ వైద్య సమాఖ్య గళమెత్తింది. మరోవైపు ఇంగ్లండ్‌వ్యాప్తంగా ఆసుపుత్రుల్లో జూనియర్‌ వైద్యులపై పనిభారం పెరిగింది. కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో చికిత్స కోసం వచ్చే రోగుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. సమ్మెలు ప్రకటించినప్పుడు చర్చలకు పిలవని పద్ధతిని ప్రభుత్వం మార్చుకోవాలని బ్రిటన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ నాయకుడు డాక్టర్‌ రాబర్ట్‌ లారెన్‌సన్‌, డాక్టర్‌ వివేక్‌ త్రివేది సూచించారు. బ్రిటన్‌వ్యాప్తంగా అనేక రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు వరుసగా సమ్మెలు చేస్తున్నారు. రైల్వే, వైద్య రంగంతో పాటు అనేక రంగాల సేవలు స్తంభించిపోయాయి. ఎన్నడూ లేని విధంగా జీవన వ్యయం పెరిగిపోవడంతో ఉద్యోగులు, కార్మికులు వేతనాల్లో పెంపును డిమాండ్‌ చేస్తూ సమ్మెలు చేస్తున్నారు. వేలాది మంది వైద్యులు తాజాగా విధులను బహిష్కరించారు. దీంతో రిషి సునాక్‌ ప్రభుత్వం మెట్టుదిగక తప్పలేదు. ప్రభుత్వ రంగ ఉద్యోగులు, కార్మికుల వేతనాలను పెంచేందుకు అంగీకరించింది. సమ్మెలను విరమించాలని పిలుపునిచ్చింది. వేతనాలను పెంచేందుకుగాను స్వతంత్ర సమీక్షా సంఘాలు చేసిన సిఫార్సులను ఆమోదించింది. అయితే ఇప్పుడు తీసుకున్నదే తుది నిర్ణయమని, దీని తర్వాత ఎలాంటి చర్చలు, బేరసారాలకు తావు ఉండబోదని, ఎన్ని సమ్మెలు చేసినా తమ నిర్ణయం మారదని రిషి సునాక్‌ తేల్చిచెప్పారు. వేతనాల పెంపును ప్రకటించారు. పోలీసుల జీతాల్లో ఏడు శాతం, టీచర్లకు 6.5శాతం, జూనియర్‌ డాకర్టకు 6శాతం, వచ్చే వారం సమ్మెకు పిలుపునిచ్చిన హాస్పిటల్‌ కన్సల్టెంట్ల జీతాలనూ 6శాతం మేర పెంచుతూ రిషి సునాక్‌ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. టీచర్ల సంఘాలు ఇప్పటికే పిలుపునిచ్చిన అన్ని సమ్మెలను విరమించుకోవాలని ప్రధాని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తాజా ప్రకటనను ఉద్యోగులకు సంబంధించిన కొన్ని సంఘాలు స్వాగతించగా మరికొన్ని కంటితుడుపు చర్యగా పేర్కొన్నాయి. ఇది సంబరాలకు సమయం కాబోదని వెల్లడిరచాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img