ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కీటింగ్
సిడ్నీ: నార్త్ అట్లాంటిక్ ట్రెటీ ఆర్గనైజేషన్ (నాటో) ఆసియాలో విస్తరించాలని కోరుకోవడాన్ని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని పాల్ కీటింగ్ తప్పుబట్టారు. నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్‌ను ‘సుప్రీం ఫూల్’, ‘అమెరికన్ ఏజెంట్’ అని కీటింగ్ విమర్శించారు. ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత నాటో ఉనికి కొనసాగింపు ఇప్పటికే విస్తృత ఐరోపాకు శాంతియుత ఐక్యతను నిరాకరించిందని కీటింగ్ పేర్కొన్నారు. గత శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరగడంతో సహా 300 సంవత్సరాలుగా యూరోపియన్లు ఒకరితో ఒకరు పోరాడుతున్నారన్నారు. ‘ఆ హానికరమైన విషాన్ని సుదీర్ఘ పేదరికం, దారిద్య్రం నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆసియాకు ఎగుమతి చేయడం అనేది ఆసియాలో ప్లేగు వ్యాధిని స్వాగతించడంతో సమానం’ అని అన్నారు. స్టోల్టెన్‌బర్గ్ అని అత్యంత మూర్ఖుడిగా కీటింగ్ నొక్కి చెప్పారు. ‘‘స్టోల్టెన్‌బర్గ్ ఐరోపా భద్రతకు నాయకుడిగా, ప్రతినిధిగా వ్యవహరించే దానికంటే ఎక్కువగా అమెరికన్ ఏజెంట్‌గా వ్యవహరిస్తాడు. ఐరోపాపై ఆయన అభిప్రాయాలు ఏమైనప్పటికీ, స్టోల్టెన్‌బర్గ్ రెండవ అతిపెద్ద యూరోపియన్ దేశమైన ఫ్రాన్స్‌కు ప్రాతినిధ్యం వహించడు’ అని కీటింగ్ తెలిపారు. ఆసియాలో నాటో విస్తరణ ప్రణాళికలకు దూరంగా ఉండేలా నాటో సభ్యదేశాలను ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హెచ్చరించడం సరైనదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘నాటో ఒక సైనిక సంస్థ. పౌర సంస్థ కాదు. యూరప్, అట్లాంటిక్‌పై దృష్టి కేంద్రీకరించిన సంస్థ’ అని కీటింగ్ పేర్కొన్నారు.