ఖాట్మండు: నేపాల్ ప్రధాని కమల్ దహల్ ప్రచండ సతీమణి సీతా దహల్ (69) కన్నుమూశారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఆమె ఖాట్మండులోని నోర్వీ ఇంటర్నెషనల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 8.33 గంటలప్పుడు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు వివరాలను పత్రికా సమన్వయకర్త సూర్య కిరణ్ శర్మ వెల్లడిరచారు. సీతా దహల్ ప్రోగ్రెసివ్ సూప్రాన్యూక్లియర్ పాల్సీ (పీఎస్‌పీ), పార్కిన్‌సన్, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలతో ఇబ్బంది పడినట్లు ఆసుపత్రి బులెటిన్ పేర్కొంది. ఆరోగ్యం విషమించడంతో ఆమెను బుధవారం ఆసుపత్రికి తరలించి, అత్యవసర చికిత్స అందించినప్పటికి ఆమె ప్రాణాలను కాపాడలేకపోయినట్లు ప్రొఫెసర్ డాక్టర్ యువరాజ్ శర్మ వెల్లడిరచారు. ప్రచండ, సీత దంపతులకు నలుగురు సంతానం. వారిలో పెద్ద కుమార్తె గ్యాను దహల్, ఏకైక కుమారుడు ప్రకాశ్ దహల్ ఇంతకుముందే మరణించారు. మరో ఇద్దరు కుమార్తెల్లో ఒకరైన రేణు దహల్ ప్రస్తుతం భరత్‌పూర్ నగర మేయర్‌గా ఉన్నారు. సీతా దహల్ అంత్యక్రియలు ఖాట్మండులోని పశుపతి ఆలయం వద్ద ఆర్యఘాట్‌లో మధ్యాహ్నం 2గంటలకు ముగిశాయి. అనేకమంది ప్రముఖులు నివాళులర్పించారు.