. గతాన్ని మరిచి యూరప్‌తో కొత్త సంబంధాలను కోరుతున్నాం
. సెలాక్`ఈయూ సదస్సులో మదురో
బ్రసెల్స్: వెనిజులాపై అనైతిక, అక్రమ, నేరపూరిత ఆంక్షలన్నింటిని బేషరతుగా ఎత్తివేయాలని ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో డిమాండ్ చేశారు. గతాన్ని మరిచి యూరప్‌తో దౌత్యపరంగా సంబంధాల పునరుద్ధరణను కోరుకుంటున్నట్లు తెలిపారు. లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలు (సెలాక్), యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ తమ వాస్తవికతను వెల్లడిరచడం ద్వారా వెనిజులా గతంలో జీవించాలని అనుకోవడం లేదని యూరప్ గ్రహిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. మళ్లీ జోక్యం, వలసవాద కాలంలోకి వెళ్లాలని లేదని యూరోప్ అర్థం చేసుకోగలదని ఆయన ఆకాంక్షించారు. తాము గౌరవాన్ని కోరుకుంటున్నామని, అది లభిస్తే అన్ని సాధ్యమవుతాయని మదురో అన్నారు. ‘మా సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితాన్ని గౌరవించాలి. మా దేశంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి. అవి అనైతికమైనవి. అక్రమమైనవి, నేరసూరితమైనవి, ఆమోదయోగ్యం కానివి. బేషరతుగా వాటన్నింటిని రద్దు చేయాలి. దేశంలో అంతర్గతంగా ఏం జరిగినాగానీ వాటిని వెనిజులా ప్రజలు అంగీకరించబోరు’ అని మదురో నొక్కిచెప్పారు. వెనిజులా శాంతంగా జీవించాలనుకునే దేశమని, ఆంక్షలను ఎత్తివేస్తేనే అది సాధ్యమన్నారు. అంతేకాకుండా ఆర్థికపరంగా పరస్పర ఆధారానికి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. యూరప్ పెట్టుబడిదారులు వెనిజులాకు రావాలని అనుకుంటున్నారని, ఇంధనం, గ్యాస్, పెట్రోకెమికల్స్ వ్యవసాయం, పర్యాటకం, తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వారిని ఆహ్వానిస్తున్నామని మదురో అన్నారు. యూరోపియన్ యూనియన్`వెనిజులా దౌత్య బంధాన్ని కొత్తగా ప్రారంభించుకోవడం అవసరమన్నారు. గతంలో అధ్యక్షుడు జువాన్ గ్వైడో పాలనను ఆపాదించాలని అమెరికా యత్నించిందని, ఎవరూ ఎన్నుకోని వ్యక్తిని అధ్యక్షుడిగా తెచ్చి పెట్టి, ఆయన పాలనను అమలు చేయాలనుకోవడం నేరమని అన్నారు. ఏళ్లు గడిచిన క్రమంలో వెనిజులాకు నిజమైన అధ్యక్షుడు ఎవరన్నది తేలిపోయిందని మదురో నొక్కిచెప్పారు. తమ దేశంపై దాడులను వెనిజులా తిప్పికొట్టిందని చెబుతూ యూరప్, వెనిజులా మధ్య కొత్త చరిత్ర సృష్టించాలని మదురో ఆకాంక్షించారు.