నవంబర్‌లో జరగబోయే యూఎస్ ప్రెసిడెన్సియల్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరు ఖరారైంది. ఈ మేరకు కమలా హారిస్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించారు. తన అభ్యర్థిత్వానికి సంబంధించిన దరఖాస్తులపై సంతకం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఫొటోను పంచుకున్నారు. నవంబర్‌లో తన ప్రజాశక్తితో కూడిన ప్రచారమే గెలుస్తుందని ఈ సందర్భంగా హారిస్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఓటు ద్వారా గెలిచేందుకు కృషి చేస్తానని తెలిపారు.కాగా, ఇటీవలే అధ్యక్ష ఎన్నికల నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలా హారిస్ పేరు తెరపైకి వచ్చింది. ఆ వెంటనే ఆమెకు అన్ని వర్గాల నుంచి భారీ మద్దతు లభించింది. ఇక మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు సైతం హారిస్‌కు మద్దతు ప్రకటించారు. అమెరికాకు ఆమె అద్భుతమైన అధ్యక్షురాలు అవుతారని ఒబామా ప్రశంసించారు. ఈ మేరకు శుక్రవారం ఒబామా, ఆయన సతీమణి మిషెల్.. హారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఒక వీడియో విడుదల చేశారు.నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించడానికి చేయగలిగినంత సహాయాన్ని చేస్తామని, ఈ పదవికి ఆమె అర్హురాలని తెలిపారు. తొలుత హారిస్‌కు ఒబామా మద్దతు ప్రకటించక పోవడంతో ఆయన ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం జరిగింది. అయితే, ఒబామా దంపతుల మద్దతుతో ఆ ప్రచారానికి చెక్ పడినట్లైంది. మరోవైపు రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే.