తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఆయన చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. గతంలో ఆయన త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఈ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన సీజేగా ప్రమాణం చేసిన ఏకే సింగ్ కు అభినందనలు తెలియజేశారు. కాగా ఇటీవల దేశంలో ఐదుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేస్తూ, ఐదు హైకోర్టులకు కొత్త సీజేలను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణతో పాటు త్రిపుర, మద్రాస్, రాజస్థాన్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు బదిలీ అవ్వగా.. మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, కర్ణాటక, గువాహటి, పట్నా హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు.
ఏకే సింగ్ గురించి క్లుప్తంగా…
న్యాయకోవిదుల కుటుంబంలో మూడో తరానికి చెందిన జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ 1965 జూలై 7న డాక్టర్ రాంగోపాల్‌సింగ్, డాక్టర్ శ్రద్ధ సింగ్ దంపతులకు జన్మించారు. ఆయన తల్లివైపు కుటుంబానికి చెందిన తాత జస్టిస్ బీపీ సిన్హా సుప్రీంకోర్టు ఆరో ప్రధాన న్యాయమూర్తిగా, మరో తాత అయిన జస్టిస్ శంభుప్రసాద్ సింగ్ పట్నా హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సమీప బంధువులైన జస్టిస్ బిశ్వేశ్వర్ ప్రసాద్, జస్టిస్ శివకీర్తి సింగ్ సుప్రీంకోర్టు జడ్జీలుగా పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ ఆనర్స్, న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందిన ఏకే సింగ్ 1990లో ఉమ్మడి పట్నా హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1990 నుంచి 2000 వరకు పట్నా హైకోర్టులో, 2001 నుంచి 2012 వరకు జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా పలు కీలక కేసులు వాదించారు. 2012లో జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయయమూర్తిగా, 2014లో శాశ్వత న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2022లో జార్ఖండ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా సేవలు అందించి, 2023లో త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. తాజాగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై రానున్నారు.