Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

మువ్వన్నెల జండాలతో మురిసిన రాజంపేట

ఉవ్వెత్తున ఎగిసిన జాతీయ భావం

ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్, కలెక్టర్, ఎస్పీ

విశాలాంధ్ర -రాజంపేట: ఆజాదీకా అమృత్ మహోత్సవాలలో భాగంగా శనివారం చేపట్టిన హర్ ఘర్ తిరంగా మహా ర్యాలీ విజయవంతమైంది. త్రివర్ణ పతాకాలు, జయ జయ ధ్వానాలుతో పట్టణంలో జాతీయతాభావం ఉవ్వెత్తున ఎగిసి పడింది. జిల్లా కలెక్టర్ పి.ఎస్ గిరీష ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, రాజంపేట శాసనసభ్యుడు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి, తంబళ్లపల్లె శాసనసభ్యుడు ద్వారకానాథ్ రెడ్డి, జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఆర్డీవో కోదండరామిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి, అల్లూరి సీతారామరాజు విగ్రహ దాత రేనాటి రాఘవేంద్ర వర్మ, తదితర ముఖ్య నాయకులు, అధికారులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానం నుంచి ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు, సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్లతో కలిసి సుమారు పదివేల మందితో రోడ్లు మరియు భవనాల శాఖ కార్యాలయం వరకు మెగా ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా, డీజే మైక్ సౌండ్ లతో, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, గుర్రపు స్వారీలు, స్వాతంత్రోద్యమ నాయకుల వేషధారణలతో ర్యాలీ కొనసాగింది. స్వచ్ఛంద సంస్థలు, స్థానిక విద్యాసంస్థల సహకారంతో అడుగడుగునా మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆర్ అండ్ బి బంగ్లా వద్ద సుమారు 5 వేల మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో రాజంపేట డిఎస్పి జి.శివ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు భారీ బెలూన్లు ఎగురవేసి, 300 అడుగుల భారీ జాతీయ పతాకంతో ఉదయం 9:30 నిమిషాలకు ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ సుమారు 11:30 నిమిషాలకు ఆర్ అండ్ బి బంగ్లా వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంది. అనంతరం ఆర్ అండ్ బి బంగ్లా వద్ద బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని పొందింపజేయడానికే ఈ ఆజాదీకా అమృత్ మహోత్సవాల ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాలతోనే నేడు మనం స్వతంత్ర భారతంలో స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని తెలిపారు. అలాంటి అమరవీరులను స్మరించుకుంటూ భావి తరాలకు వారి చరిత్రను తెలియజేయడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ రామచంద్రయ్య మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ నాయకులను స్మరించుకుంటూ ఆజాదీకా అమృత మహోత్సవాలలో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరింపజేయడం స్ఫూర్తిదాయకమని అన్నారు. శాసనసభ్యులు మేడా మల్లిఖార్జున రెడ్డి మరియు జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలు మాట్లాడుతూ రాజంపేట చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇంతటి ఘనంగా నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలందరి సహకారంతోనే హర్ ఘర్ తిరంగ మహా ర్యాలీ, ఆజాదీకా అమృత మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు జాతీయ గీతాలాపనలో నాయకులు, పుర ప్రజలు, విద్యార్థులు సామూహికంగా నిర్దిష్టంగా, నిశ్చలంగా నిలబడి దేశ భక్తిని చాటారు. అనంతరం ఆర్ అండ్ బి బంగ్లా వద్ద ఏర్పాటుచేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని అట్టహాసంగా ఆవిష్కరించి గజమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అమీమ్ అన్సారియా, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, డి.ఎస్.పి శివ భాస్కర్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పోతుపాటి సర్రాజు, పట్టణ సీఐ నరసింహారావు, రూరల్ సీఐ పుల్లయ్య, మున్సిపల్ కమిషనర్ ఎం.జనార్దన్ రెడ్డి, అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, తాసిల్దార్ సుబ్రమణ్యం రెడ్డి, వైకాపా నాయకులు రెడ్డి మాసి రమేష్ నాయుడు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు సత్యాల రామకృష్ణ, ప్రముఖ నాయకులు, విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, సచివాలయ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img