గన్నవరం : కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్తం వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఆఫీసులోని అద్దాలు పగలగొట్టి.. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కారుకు నిప్పుపెట్టారు ఆందోళనకారులు. కత్తులతో టీడీపీ ఫ్లెక్సీలను చించివేసి విధ్వంసం సృష్టించారు. మంటలను ఆర్పేందుకు వచ్చిన ఫైర్ ఇంజన్లను కూడా అడ్డుకున్నారు.
ఎమ్మెల్యే తీరుపై టీడీపీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయం నుంచి జాతీయ రహదారిపై నిరసనగా బయలుదేరి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యే వంశీ అరాచకాలు నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యేపై గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీడీపీ ఆఫీస్ చుట్టూ వంశీ కారులో తిరుగుతున్నారని వారు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్దే పోలీసులు ఉన్నా పట్టించుకోవట్లేదని ఫైర్ అయ్యారు. కంప్యూటర్లు, ఫర్నీచర్, ఐదు వాహనాలు ధ్వంసమైనట్లు చెబుతున్నారు. 50 నుంచి 60 మంది దాడిలో వైసీపీ నేతలు పాల్గొన్నారని తెలిపారు.
ప్రెస్‌మీట్‌లో టీడీపీ అగ్రనేతలపై వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేయగా.. తెలుగుదేశం పార్టీ నేతలు ఖండించారు. దీంతో వల్లభనేని వంశీకి వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆగ్రహంతో వంశీ వర్గీయులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌పై దాడి చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు ప‌్రయత్నిస్తున్నారు.


