Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జాతీయ నేతలు జర్నలిస్టులకు ఆదర్శప్రాయులు

విజయవాడ (గాంధీనగర్‌) : దివంగతులైన ఐజేయూ వ్యవస్థాపకులు సంతోష్‌ కుమార్‌, ఐజేయూ జాతీయ నాయకులైన కె.అమర్‌నాథ్‌ లు భారతీయ జర్నలిస్టులందరికీ ఆదర్శప్రాయులని సీనియర్‌ జర్నలిస్ట్‌ జి.ఉపేంద్రబాబు,ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు అన్నారు. ఏపీయూడబ్య్లూజే అర్బన్‌ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఐజేయూ వ్యవస్థాపకులు సంతోష్‌ కుమార్‌,ఐజేయూ జాతీయ నాయకులు కె.అమర్నాథ్‌ల సంస్మరణ సభ ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే అర్బన్‌ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభలో తొలుత ముఖ్య అతిథులు దివంగత నేతలైన నేతల చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళుర్పించారు.అనంతరం రెండు నిముషాలు మౌనం పాటించారు.ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మాజీ అధ్యక్షులు గారపాటి ఉపేంద్ర బాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంతోష్‌ కుమార్‌ కూలంకషంగా చర్చించేవారన్నారు. వాటిపై నేతలందరితో మాట్లాడేవారన్నారు.అమర్నాథ్‌ ముక్కు సూటిగా మాట్లాడే వారన్నారు.ఇంగ్లీష్‌ బాగా వచ్చినప్పటికీ ఆయన తెలుగుపత్రికల్లోనే పని చేశారన్నారు. జర్నలిస్ట్‌ యూనియన్‌ నాయకుడిగా అనేక పోరాటాలు చేశారని వారి సేవలను కొనియాడారు. మరో ముఖ్య అతిథి ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ సంతోష్‌ కుమార్‌ ను ఓ డైనమిక్‌ లీడర్‌గా అభివర్ణించారు. జర్నలిస్టులు,నాన్‌ జర్నలిస్టుల ఐక్యతకు సంతోష్‌ కుమార్‌ ఎంతో కృషి చేశారన్నారు. సభల్లో ఆయన ఎంతో ఉద్విగ్నంగా, గంభీరంగా మాట్లాడేవారన్నారు. ఆలిండియా న్యూస్‌ పేపర్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా నిబద్ధతతో పని చేశారన్నారు.పశ్చిమ పాకిస్థాన్‌ నుంచి వచ్చిన సంతోష్‌ కుమార్‌ ప్రతాప్‌ అనే ఉర్దూ పత్రికలో న్యూస్‌ ఎడిటర్‌ గా పనిచేసి రిటైరయ్యారన్నారు. సంతోష్‌ కుమార్‌ జర్నలిస్టులకు మార్గదర్శి అని కొనియాడారు. ఏపీడబ్ల్యూజే అధ్యక్షుడిగా, ఐజేయూ సెక్రటరీగా చేసిన అమర్నాథ్‌ కు జర్నలిస్టుల యాక్ట్‌ పై పూర్తి అవగాహన ఉందన్నారు. ఆంగ్లంపై పూర్తి స్థాయిలో పట్టున్న అమర్నాథ్‌ ఇంగ్లీష్‌ పత్రికల్లోకి వెళ్లలేదన్నారు. ఆయన నిర్మొహమాటంగా మాట్లాడమే కాకుండా అందరినీ అరే అబ్బాయ్‌ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేవారన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అమర్నాథ్‌ దృష్టికి తీసుకెళితే ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా ఉన్న ఆయన వాటి పరిష్కారానికి కృషి చేశారన్నారు. సంతోష్‌ కుమార్‌, అమర్నాథ్‌ ల మృతి.. జర్నలిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు.సీనియర్‌ జర్నలిస్టు ఎస్‌.కె.బాబు మాట్లాడుతూ గడచిన ఏడాదిన్నర కాలంలో అనేక మంది జర్నలిస్టులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐజేయూ వ్యవస్థాపకుడు సంతోష్‌ కుమార్‌ మాట్లాడితే సింహ గర్జన మాదిరి ఉండేదన్నారు. ఆయన ఉపన్యాసం విని నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రముగ్దుడై అరగంట సేపు జర్నలిస్టుల సమస్యలను వేదికపైనే చర్చించడం ఎంతో గర్వించదగిన పరిణామమన్నారు. తనకు అమర్నాథ్‌తో నాలుగు దశాబ్దాల పరిచయం ఉందన్నారు. పీసీఐ సభ్యుడిగా జర్నలిస్టుల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించారన్నారు.ఐజేయూ నిర్వహించే పత్రిక ఎడిటోరియల్‌ లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఆర్టికల్స్‌ కి ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారన్నారు.ఏపీయూడబ్ల్యూజే అర్బన్‌ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు,ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు దివంగత నేతల సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫోటో గ్రాఫర్స్‌ అధ్యక్షులు సాంబశివరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్‌ మెంబరు జి రామారావు,స్సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ రమణారెడ్డి,అర్బన్‌ అధ్యక్షులు ఎంవీ సుబ్బారావు,దాసరి నాగరాజు,టి.శివరామకృష్ణ,తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img