ప్రత్యేక సేవల పక్షోత్సవం ప్రారంభిస్తూ ఆర్‌డీ వేణుగోపాల్
విశాలాంధ్ర – విజయవాడ: కార్మిక రాజ్యబీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) ద్వారా అందించే సేవలపై బీమాదారులలో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు ఈఎస్‌ఐసీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం ఇన్‌చార్జి డైరెక్టర్ ఏ వేణుగోపాల్ తెలిపారు. ఈఎస్‌ఐసి 71వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం అధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు ప్రత్యేక సేవల పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ పక్షోత్సవాల ప్రారంభోత్సవ వేడుకలో వేణు గోపాల్ మాట్లాడుతూ బీమా దారులకు మరిన్ని సేవలు అందించడానికి చర్యలు చేపడుతున్నామనీ, బీమా దారులకు ఈఎస్‌ఐ చట్టంపై అవగాహనా సదస్సులు, వైద్య సదస్సులు, శుభ్రత, పరిశుభ్రత నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఉన్న పరిశ్రమలు, సంస్థలలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. బీమా దారులు వారి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అవలంబించాల్సిన జీవన విధానంపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమములో భాగంగా శుక్రవారం మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో బీమాదారులకు అవగాహన సదస్సు నిర్వహించి ఈఎస్‌ఐ ద్వారా లభించే ఉపయోగాలను ఈఎస్‌ఐ అసిస్టెంట్ డైరెక్టర్ వి. శ్యామ్ ప్రసాద్, ఈఎస్‌ఐ గుణదల ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ ఆర్ వెంకటసుబ్బారెడ్డి, సిబ్బంది వివరించారు ఈ కార్యక్రమంలో సుమారుగా 220 మంది బీమా దారులు పాల్గొన్నారు.

