Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాజకీయ జోక్యం బాధాకరం


నాగసాకి డే సదస్సులో అక్కినేని చంద్రరావు

విశాలాంధ్రవిజయవాడ : నేడు ప్రపంచ వ్యాపితంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాజకీయ ప్రమేయం, మతపరమైన జోక్యం పెరగడం బాధాకరమని ప్రోగ్రెసివ్‌ ఫోరం నాయకుడు, సి.రాఘవాచారి ట్రస్ట్‌ ప్రతినిధి అక్కినేని చంద్రరావు అన్నారు. హిరోషిమా, నాగసాకి పట్టణాలపై 1945లో ఆగస్టు 6, 9 తేదీల్లో అణుబాంబుల దాడి, మారణకాండ జరిగి 77 ఏళ్లు గడిచిన సందర్భంగా సోమవారం సిద్ధార్థ మహిళా కళాశాల, భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం (ఇస్కఫ్‌) సంయుక్త ఆధ్వర్యంలో కళాశాల వెబినార్‌ హాలులో సదస్సు నిర్వహించారు. నాటి ఘటనలతో విద్యార్థినులు చిత్రమాలికను ప్రదర్శించారు. అనంతరం ‘హిరోషిమా, నాగసాకి యుద్ధ పరిణామాలు`నేర్చుకోవాల్సిన గుణపాఠాలు’ అంశంపై అక్కినేని చంద్రరావు ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మానవాళికి పర్యావరణ పరిరక్షణ, విద్య, వైద్యం అవసరం అని చెప్పారు. మూడవ ప్రపంచ యుద్ధం పొంచి ఉందని, యురేనియం, అణు యుద్ధాల వల్ల కలిగే నష్టాలను గుర్తించిన శాస్త్రవేత్తలు మనిషి జీవించడానికి మరొక గ్రహాన్ని కనిపెట్టాల్సిన పరిస్థితి ఉందని ఐన్‌స్టీన్‌ , స్టీఫెన్‌ హాకింగ్‌ వంటి విఖ్యాత శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. నేడు ప్రపంచ వ్యాపితంగా సైన్స్‌లో రాజకీయ, మతపరమైన జోక్యం పెరగడం ప్రమాకరమని అన్నారు. ప్రస్తుత పరిణామాలపై సైన్స్‌ విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కళాశాల సంచాలకులు విజయలక్ష్మి, ప్రధాన అధ్యాపకులు ఎస్‌.కల్పన మాట్లాడుతూ హిరోషిమా, నాగసాకిపై దాడుల వల్ల లక్షల మంది ప్రజలు మరణించగా, వేల సంఖ్యలో వికలాంగులుగా, క్యాన్సర్‌ రోగులుగా చాలాకాలం ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్‌, చైనా, తైవాన్‌, అమెరికా, పాకిస్తాన్‌, ఇరాన్‌ వంటి దేశాల్లో యుద్ధాల వల్ల నష్టాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయన్నారు. ఇస్కఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ ప్రజా నాట్యమండలి రాష్ట్ర కోశాధికారి అర్‌.పిచ్చయ్య అణు యుద్ధాల వల్ల నష్టాలను వివరిస్తూ శాంతి ఉద్యమ గేయాలను ఆలపించారు. ఈ సదస్సుకు ఇస్కఫ్‌ కృష్ణా జిల్లా కార్యదర్శి మోతుకూరి అరుణకుమార్‌ అధ్యక్షత వహించగా, జన విజ్ఞాన వేదిక నాయకుడు ఓలేటి శివప్రసాద్‌, సిద్ధార్థ మహిళా కళాశాల రసాయన శాస్త్ర విభాగ అధిపతి ఎం.సుభాషిణి, ఏఐఎస్‌ఎఫ్‌ నగర ప్రధాన కార్యదర్శి ఎం.సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img