Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

తరగతి గదిని కిందకు మార్చండి

దివ్యాంగ విద్యార్థి అర్జీపై వెంటనే స్పందించిన కలెక్టర్‌
ఆరో తరగతిలో అడ్మిషన్‌ ఇవ్వాలని డీఈవోకు సూచన

విశాలాంధ్ర`విజయవాడ : ఆత్మస్థైర్యం, చదవాలన్న పట్టుదల ఉంటే జీవితంలో లక్ష్యాన్ని సాధించవచ్చని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు అన్నారు. విద్యార్థి ప్రదీప్‌ పట్టుదల దివ్యాంగులకు స్ఫూర్తిదాయకమని ఆయన చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన దివ్యాంగ విద్యార్థి మేకల ప్రదీప్‌ తన తల్లి మేకల ఉమామహేశ్వరితో కలిసి వచ్చి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. తాను ప్రకాశ్‌నగర్‌లో నివసిస్తున్నానని, తనకు జన్యులోపంతో పుట్టుకతోనే రెండు కాళ్లలో బలం లేక నడవలేని స్థితిలో బాధపడుతున్నానని, నడవాలని ప్రయత్నించి ఆరుసార్లు పడిపోయి కాళ్లకు దెబ్బలు తగిలి సజ్జరీ కూడా చేయించుకున్నానని ప్రదీప్‌ తెలిపాడు. అయినప్పటికీ చదువుపై ఉన్న ఆసక్తితో ఐదో తరగతి వరకు చదివానని చెప్పాడు. తనకు బాగా చదువుకుని కీిళ్ల డాక్టర్‌ కావాలని కోరికగా ఉందని, అయితే ఆరో తరగతి చేరేందుకు ఇబ్బందిగా ఉందని వివరించాడు. ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ప్రయత్నిస్తే ఆరో తరగతి గది మొదటి అంతస్తులో ఉండటం వల్ల తనను చేర్చుకోవడానికి పాఠశాల ఉపాధ్యాయులు తిరస్కరిస్తున్నారని తెలిపారు. దయచేసి తన సమస్యను పరిష్కరించి చదువుకునే మార్గం చూపించాలని విజ్ఞప్తి చేశాడు. ప్రదీప్‌ తల్లి ఉమామహేశ్వరి మాట్లాడుతూ తన భర్త కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నపటికీ తాను కూలీ పనులు చేస్తూ దివ్యాంగుడైన కుమారుడుని చదివించుకుంటన్నానని, ఆరో తరగతిలో చేర్పించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. ప్రదీప్‌ పట్టుదల, చదువుపై ఉన్న ఆసక్తిని చూసి చలించిన కలెక్టర్‌ వెంటనే స్పందించారు. జిల్లా విద్యా శాఖ అధికారి సీవీ రేణుకను పిలిచి ప్రకాశ్‌నగర్‌ సమీపంలోని ఎల్‌బీఎస్‌ నగర్‌లో ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య మున్సిపల్‌ పాఠశాలలో మొదటి అంతస్తులో నిర్వహిస్తున్న ఆరో తరగతి సెక్షన్‌ను కింద గదికి మార్పు చేసి ప్రదీప్‌కు అడ్మిషన్‌ ఇవ్వాలని, విద్య బోధన అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ప్రదీప్‌తో కలెక్టర్‌ ముచ్చటిస్తూ ‘నిన్ను చూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది. నీకు చదువుపై ఉన్న ఆసక్తి ప్రతి విద్యార్థికి ఆదర్శప్రాయం. సమస్యను సాధించుకోవాలన్న పట్టుదల, ఆత్మస్థైర్యం దివ్యాంగులకు అడ్డురాదని నిరూపించావు. నీకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తాం. ఉన్నత చదువులు అభ్యసించేవరకు అనుకూలమైన విధంగా విద్య బోధన అందించేలా చర్యలు తీసుకుంటాను. డాక్టర్‌ కావాలన్న కోరికను నెరవేర్చుకుని నీలాంటి దివ్యాంగులకు వైద్య సహాయం అందించాలి..’ అని ప్రదీప్‌ భుజంతట్టి ప్రోత్సహించారు. స్పందన కార్యక్రమంలో మొత్తం 81 అర్జీలు రాగా, వాటిలో అత్యధికంగా రెవెన్యూకు సంబంధించినవి 26 ఉన్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజయ్‌ కుమార్‌, డీఆర్వో కె.మోహన్‌కుమార్‌, డ్వామా పీడీ జె.సునీత, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img