Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా నిరసన

విశాలాంధ్ర – బెలగాం : ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించండని, జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ వేసి అదానీ ఆస్తులను జాతీయం చేయాలని, సిపిఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మదరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్నలు డిమాండ్ చేశారు. జేపీసీ కమిటీ వేసి అదానీ ఆస్తులను జాతీయం చేయాలని, రాష్ట్రానికి నష్టం చేసే కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలపై భారాలు ఆపాలంటూ కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్, అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం గానీ, ప్యాకేజీ గాని ఏర్పాటు చేయలేదన్నారు. ఉపాధి హామీ చట్టం, 90 వేల కోట్ల నుండి 70 వేల కోట్లకు తగ్గించారని, ఆహార సబ్సిడీ రూ. 90,000 కోట్లు, మధ్యాహ్నం భోజనానికి 12 వేల కోట్లు, ఎరువులకు 50 వేల కోట్లు, పెట్రోల్ డీజిల్ కు 7,000 కోట్లు, సబ్సిడీలు తగ్గించారని, ఇది వ్యవసాయ కూలీల వ్యతిరేక బడ్జెట్ అన్నారు. వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కోత పెట్టడం దారుణమని విమర్శించారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమ సందర్భంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతులను మోసగించారన్నారు. మద్దతు ధరలు గ్యారెంటీ చేసే చట్టం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయడం లేదన్నారు. రైతులు సమగ్ర రుణమాఫీ కోరుతున్న ఈ బడ్జెట్లో ఎటువంటి చర్యలు లేవన్నారు. కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయదని ప్రశ్నించారు. రైతులకు సమగ్ర రుణమాఫీ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ వ్యవసాయానికి బాటలు వేస్తూ రైతులు వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు ధారా దత్తం చేయడం తగదన్నారు. ఉపాధి హామీ పథకానికి భారీగా నిధులు కోత పెట్టడం వలన భవిష్యత్తులో వ్యవసాయ కార్మికుల ఉపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎరువుల సబ్సిడీ నిధులు కోత వలన ఎరువుల ధరలు మరింత పెరుగుతాయన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలుకు కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేశారని విమర్శించారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు లేవన్నారు. కడప ఉక్కు పరిశ్రమ ప్రస్తావనే లేదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గరుగుబిల్లి సూరయ్య మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని కోరారు ప్రజలపై భారాలు వేసే విధంగా ఉన్న కేంద్ర బడ్జెట్ ను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు పువ్వుల ప్రసాద్, నాయకులు రంగారావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img