విశాలాంధ్ర- పెద్దకడబూరు : ప్రశ్నించే గొంతుకలను గెలిపించి చట్ట సభలకు పంపాలని ఏఐఎస్ఎఫ్ తాలూకా కార్యదర్శి ఈరేష్ కోరారు. గురువారం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లోని విద్యాసంస్థలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్ రద్దు చేయాలని పోరాడే ప్రభుత్వ ఉద్యోగులపై ఉక్కు పాదం మోపి, లాఠీ చార్జీలు, అక్రమ కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటినీ ప్రశ్నించే గొంతుకలను కూడా నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కత్తి నరసింహారెడ్డి ఉపాధ్యాయుల, అధ్యాపకుల ఎదుర్కొంటున్న సమస్యలను నిరంతరం చట్ట సభల్లో గళమెత్తారని అన్నారు. పోతుల నాగరాజు అనేక ఉద్యమాలకు సారథ్యం వహించారన్నారు. కావున ప్రశ్నించే గొంతుకలు కత్తి నరసింహారెడ్డి కి, పోతుల నాగరాజులకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి వేయించి చట్టసభలకు పంపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.