విశాలాంధ్ర -ఆస్పరి : మట్టి పరీక్షలపై మండలంలోని రైతు భరోసా కేంద్రాల గ్రామ వ్యవసాయ సహాయకులకు శంకరబండ రైతు భరోసా కేంద్రం నందు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. నేల ఆరోగ్యం మరియు మట్టి పరీక్షలపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి మునెమ్మ అధ్యక్షతన వహించి పలు అంశాలపై క్షేత్ర స్థాయి సిబ్బందికి అవగాహన కల్పించారు. పొలంలో మట్టి నమూనాల సేకరణ విధానము, చతుర్విభజన పద్ధతిలో మట్టి నమూనా తీసి సమాచార పత్రం జతచేసి ప్రయోగశాలకు పంపడం మొదలైన అంశాలను వివరించారు. భూసార పరీక్ష అవసరాన్ని, వివిధ రకాలు నేలలు వాటి భౌతిక, రసాయనిక లక్షణాలను తెలిపారు. భూసార పరీక్షా కేంద్రంలో నిర్వహించే పరీక్షలు, అందుకు అనుగుణంగా ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఆర్‌బీకే పరిధిలోని రైతుల పొలాల్లో మట్టి నమూనా సేకరణ పూర్తి చేయాలని ఇన్చార్జీలకు సూచించారు. భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా మాజీ మండల కన్వీనర్ సుంకర రామాంజనేయులు, కో కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, వ్యవసాయ సిబ్బంది, రైతు భరోసా కేంద్రాల ఇన్చార్జీలు, రైతులు పాల్గొన్నారు.