విశాలాంధ్ర, పెద్దకడబూరు :పెద్దకడబూరు మండలానికి రెగ్యులర్ తాహశీల్దార్ ను నియమించాలంటూ మంగళవారం సిపిఐ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, కమిటీ సభ్యులు రాజు మాట్లాడుతూ మండలానికి గత సంవత్సరం నుంచి రెగ్యులర్ తాహశీల్దార్ లేడన్నారు. దీంతో తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రెగ్యులర్ తాహశీల్దార్ లేకపోవడంతో డిప్యూటీ తహసీల్దార్ అక్రమాలకు అంతులేకుండా పోతుందని ఆరోపించారు. ప్రజలు ఏదైనా అడిగితే ఆర్ ఐ కి, వీఆర్వో కు, సీనియర్ అసిస్టెంట్ కు రెఫర్ చేస్తానని కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయ నాయకులను కూర్చోబెట్టి పనులు వెంటనే చేస్తున్నారని, సామాన్య ప్రజలకు న్యాయం జరగడం లేదన్నారు. డిప్యూటీ తహసీల్దార్ కు పనులపై అవగాహన లేదని, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు ఏది చెపితే అది వింటున్నారని తెలిపారు. కావున తక్షణమే జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు పై చర్యలు తీసుకోవాలని, మొత్తం రెవెన్యూ కార్యాలయాన్ని ప్రక్ఱాలన చెయ్యాలని లేకపోతే లంచాలకు నిలయంగా మారే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా సబ్ కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు జాఫర్ పటేల్, నాయకులు తిక్కన్న, డోలు హనుమంతు, రఫిక్, రామాంజనేయులు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.