విశాలాంధ్ర- పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు బుధవారం ఏఐకెఎస్ ఆధ్వర్యంలో తాహశీల్దార్ వీరేంద్ర గౌడ్ చేతుల మీదుగా రైతు డైరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం తాలూకా కార్యదర్శి ఆంజనేయ మాట్లాడుతూ రైతుల పక్షాన పోరాడి, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ఏఐకెఎస్ ముందు ఉంటుందన్నారు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని, వారు కష్టపడి పండిస్తేనే మన చేతి వేళ్లు నోట్లోకి వెళతాయన్నారు. అలాంటి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక పోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం మన రాష్ట్రంలో కూడా అమలు చేసి రైతులకు నెలకు 3000 రూపాయలు పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్యాంకులో రైతులు తీసుకున్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలన్నారు. పులికనుమ, వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు మూడు పంటలకు సాగునీరు ఇవ్వాలని, లేనిపక్షంలో ఏఐకెఎస్ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధం అవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, కంప్యూటర్ ఆపరేటర్ రమేష్, రైతులు బాబు, తిక్కన్న, లక్ష్మన్న, హనుమన్న తదితరులు పాల్గొన్నారు.