విశాలాంధ్ర, పెద్దకడబూరు : రైతు, ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం తాలూకా కార్యదర్శి ఆంజనేయ, కమిటీ సభ్యులు రాజు మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలలో రైతుల భూ సమస్యలను పరిష్కరించడంలో రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ మహేష్ ఘోరంగా విఫలం చెందారని ఆరోపించారు. మండలంలో చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పరిష్కారానికి తహసీల్దార్ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. మండల పరిధిలోని కల్లుకుంట, హెచ్ మురవణి గ్రామాల్లో సాగులో ఉన్నా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఇటు భూ రీసర్వే సమస్యలు పరిష్కారం కాక ఎక్కడివక్కడే నిలిచిపోయాయని, దీంతో రైతులు కార్యాలయం చుట్టూ తిరిగుతున్నా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే పక్కాగ జరిపి భూ సరిహద్దుల్లో రాళ్లను పాతిస్తామని చెప్పి ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్ట లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతు, ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ వీరేంద్ర గౌడ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు జాఫర్ పటేల్, నాయకులు తిక్కన్న, డోలు హనుమంతు, వీరేష్, సర్వరాయుడు, నాగేష్, గిడ్డయ్య, మురవణి గ్రామానికి చెందిన మహిళా రైతులు పాల్గొన్నారు.