Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

కర్నూలు జిల్లా నల్లమల అడవి లోయలో పడిపోయిన లారీ

విశాలాంధ్ర శిరివెళ్ల/ఆస్పరి/నంద్యాల సిటీ : కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో నలుగురు మృత్యువాత పడ్డారు. దట్ట మైన నల్లమల అడవి మార్గంలో లారీ అదుపు తప్పి 400 అడుగుల లోతైన లోయలో పడిపోయిన ఘటన శిరివెళ్ల మండలం దొరబావి వంతెన సమీపంలో చోటు చేసుకుంది. లారీ యజమాని మృతి చెందగా డ్రైవర్‌ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. శిరివెళ్ల మండల ఎస్‌ఐ సూర్య మౌళి తన సిబ్బందితో కలిసి సాహసంతో ఈ అటవీ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. అతికష్టం మీద మృతదేహాన్ని మోకుల ద్వారా 400 అడుగుల లోతులో నుంచి నంద్యాల, ఒంగోలు రహదారి పైకి తీసుకువచ్చారు. అనంతరం పంచనామా నిమిత్తం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంలో లారీ యజమాని వెంకట రెడ్డి (55) అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్‌ అంజిబాబుకు తీవ్ర గాయాలు అయినట్లు ఎస్‌ఐ తెలి పారు. గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతుడు, డ్రైవర్‌ ఇద్దరూ ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన వారని తెలిపారు. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారిన అడవి పొదలను ఛేదించుకొని ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసిన ఎస్‌ఐ సూర్య మౌళి, ఇతర పోలీసు సిబ్బందిని అనేక మంది అభినందించారు. శుభ కార్యానికి వెళుతూ మృత్యు ఒడిలోకి.. శుభ కార్యానికి వెళుతూ బళ్లారి పట్టణానికి చెందిన మహమ్మద్‌ షబ్బీర్‌ (22) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. షబ్బీర్‌ తన స్నేహితుని కారులో 8 మంది కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో మేనత్త కూతురు నిశ్చితార్థ కార్యక్రమానికి బయలు దేరారు. ఉదయం 8 గంటల సమయంలో ఆస్పరి రైల్వే గేట్‌ దాటి కొంత దూరం వెళ్లిన తర్వాత కుక్క అడ్డు రావడంతో కారు అదుపు తప్పి బోల్తాపడిరది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న షబ్బీర్‌కు తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయల య్యాయి. చికిత్స నిమిత్తం 108లో ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో షబ్బీర్‌ మృతి చెందాడు. వాహనంలో ఉన్న నూర్‌ మహమ్మద్‌, నూర్జన్‌, గౌసబీ, షబానా, షాజీయాబీ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గిరిబాబు తెలిపారు. లారీని కారు ఢీకొని ఇద్దరి మృతి పాణ్యంకర్నూలు రహదారిపై నిలిచి ఉన్న బోర్‌వెల్స్‌ లారీని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం రాజోలికి చెందిన సంజమ్మ (37) అక్కడికక్కడే మృతి చెందగా, భర్త కేశాలు (42)కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఉమాపతి నగర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఆగి ఉన్న బోర్‌వెల్స్‌ లారీని కారు వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పాణ్యం ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img