Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి

ఈనెల 5న మండల కేంద్రాల్లో ధర్నాలు
సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య

విశాలాంధ్ర`ఆలూరు : పేదలకు ఇల్లు కల్పన కోసం జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షల తో నిర్మాణం చేసే పరిస్థితి కనిపించడం లేదని కనీసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం పట్టణంలోని శివారు ప్రాంతంలో ఉన్న జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణ పనులను సిపిఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టించి ఇంట్లోకి పంపిస్తామని ఎంతో అట్టహాసంగా హంగు ఆర్భాటాలతో ప్రకటించడం జరిగిందన్నారు. నేటికీ రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీలలో ఎక్కడ కూడా ఆ పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు. పేదల ఇంటి నిర్మాణానికి జగనన్న కాలనీలు ఊరికి దూరంగా ఇచ్చారని, ఏదోలా సొంత ఇంటి కల కోసం పేదలు ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నా.. ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు సరిపోక అప్పులు చేసి నిర్మాణపు పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమయం లోగా నిర్మాణపు పనులను పూర్తిచేయాలని లేనిపక్షంలో రద్దు చేస్తామని అధికారులు చెప్పడంతో అధిక వడ్డీలకు అప్పులు చేసి ఇంటి నిర్మాణం చేస్తున్న దుస్థితి వచ్చిందని విమర్శించారు. ప్రస్తుత ధరల పెరుగుదల వలన కనీసం ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తూ ఆ కాలనీల్లో త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. డిసెంబర్‌ 5న జగనన్న కాలనీలలో ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో సంబంధిత అధికారులకు అర్జీలు ఇచ్చే కార్యక్రమం సీపీఐ పార్టీ చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు భూపేష్‌, మండల కార్యదర్శి రామాంజనేయులు, రైతు సంఘం మండల కార్యదర్శి హోతూరప్ప, చంద్రకాంత్‌ రెడ్డి, ఏఐటియూసి మండల అధ్యక్షులు శివ, సిపిఐ నాయకులు సిద్ధా, చిన్న, సాయిలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img