విశాలాంధ్ర, పెద్దకడబూరు : జిల్లాలో, మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కురువ గుడిసె నర్సింహులు ధీమా వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరు లోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు నర్సింహులు జిల్లా కార్యదర్శిగా ఎన్నికైనందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గుడిసె నర్సింహులు, మంత్రాలయం కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ మల్లేష్, ఐన్ టియుసీ మండల అధ్యక్షులు పరమేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటూ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారాన్ని మోపిందని ఆరోపించారు. ఇటు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు, గిడ్డయ్య, లక్ష్మన్న, జోసఫ్, బడేసాబ్, చాంద్ పీరా, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.